వీరు వింటున్నది చేపల చానల్.. జాలర్ల కోసం దేశంలో తొలి FM రేడియో   - MicTv.in - Telugu News
mictv telugu

వీరు వింటున్నది చేపల చానల్.. జాలర్ల కోసం దేశంలో తొలి FM రేడియో  

October 24, 2020

FM radio

సైన్స్, టెక్నాలజీ రంగాల్లో దేశం దూసుకుపోతోంది. అయినా కొన్ని వర్గాల ప్రజలకు ఇంకా సమాచార విప్లవం దూరంగానే ఉండిపోయింది. మారుమూల ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇప్పటికీ సరైన టెక్నాలజీ అందుబాటులో లేదు. అలాంటి వారికి రేడియోనే ప్రధాన సామాచార సాధనం. తుపాన్లు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో రేడియోను మించిన సహాయక కేంద్రం ఉండదు. ముఖ్యంగా సముద్రంలో వేటకు వెళ్లే జాలర్లు ఇప్పటికే రేడియోపైనే ఆధారపడుతుంటారు. వాతావరణ హెచ్చరికలను తెలుసుకుని మరీ వేటకు వెళ్తుంటారు. 

జాలర్ల జీవితం కేవలం వేటకే పరిమితం కాదు. పట్టిన చేపలను మార్కెట్ చేసుకోవాలి. బోట్లను బాగు చేయించుకోవాలి, చిరిగిపోయిన వలలను తిరిగి కుట్టుకోవాలి. పిల్లలను చదివించుకోవాలి. ఆడుకోవాలి, పాడుకోవాలి. మరెన్నో పనులు ఉంటాయి. ఇలాంటి మరెన్నో అవసరాలను తీర్చడానికి దేశంలోనే తొలిసారిగా జాలర్ల కోసం ఒక ఎఫ్ఎం రేడియో స్టేషన్ ఏర్పాటైంది. దీని ప్రత్యేకత మరొకటి ఉంది. ఇందులో పనిచేసే 12 మంది సిబ్బందిలో ఒక్కరు తప్ప మిగతా అందరూ జాలర్ల కుటుంబాల నుంచి వచ్చిన వారే. 

తమిళనాడు తీరంలో శ్రీలంకకు కూత వేటు దూరంలోని పాంబన్ ద్వీపంలో ఈ రేడియో స్టేషన్ ఉంది. దీని పేరు ‘కడల్ ఒసై’. ఈ పదాలకు అర్థం సముద్ర సవ్వడి అని. లక్ష జనాభా ఉన్న ఈ ద్వీపంలో 80 శాతం మంది చేపల వేటపైనే ఆధారపడి ఉన్నారు. స్వయంగా జాలరి అయిన విల్సన్ ఫెర్నాండో అనే వ్యక్తి 2016లో దీన్ని ఏర్పాటు చేశాడు. 24×7 చానలైన కడల్ ఒసై ప్రసారం చేసే కార్యక్రమాలన్నీ జాలర్లకు సంబంధించినవే. వాతావరణ హెచ్చరికలు, చేపల ధరలు, డీజిల్ ధరలు, చేపలు పట్టే విధానాలు, చేపల గ్రేడింగ్, వాటి ఎగుమతులు, గవ్వలతో అలంకరణ వస్తువుల తయారీ, జాలర్ల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఉపకారవేతనాలు.. మరెన్నో అంశాలను ఈ జాలర్ల స్టేషన్ చక్కగా వివరిస్తుంది. ఎవరికి ఏ అనుమానం వచ్చినగా తీర్చేస్తుంది. ఎవరికైనా పెద్ద చేప దొరికితే  మెచ్చుకుంటూ ఇంటర్వ్యూ చేసేస్తుంది. ఈ స్టేషన్ ఓ వెబ్ సైట్ కూడా నడుపుతోంది. కడల్ ఒసై కార్యక్రమాలు ఓ పదినిమిషాలు ఆగిపోతే జాలర్లు ఏకంగా ఫిర్యాదు చేయడానికి దండెత్తినట్లు వస్తారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 

ఈ రేడియో ద్వారా పర్యావరణ సంరక్షణ కూడా జరుగుతోంది. వలల్లో పడే తాబేళ్లు, ఇతర అరుదైన జాతులను తిరిగి సముద్రంలోనే వదిలేయాలని రేడియో చెబుతుంటుంది. జాలర్లు ఈ సూచన పాటిస్తుంటారు. తాబేళ్లను తిరిగి సముద్రంలో వదిలేస్తున్న వీడియోలను స్టేషన్ సిబ్బందికి పంపుతుంటారు. పాంబన్ వెళ్లే వారికి అక్కడ చేపలతోపాటు రేడియోలు కూడా పెద్దసంఖ్యలో కనిపిస్తాయి. జాలర్లు ఎంచక్కా పడవల్లో, దుకాణాల్లో, గంపల్లో రేడియోలు పెట్టుకుని రేడియో వింటూ కనిపిస్తుంటారు. కడల్ ఒసై ఎఫ్ఎం చానల్ తమ జీవితంలో ఒక భాగమని, అది లేని జీవితాన్ని ఊహించుకోలేమని జాలర్లు చెబుతుంటారు.