ఇటీవల గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు మధ్య గొడవలు బాగా పెరుగుతున్నాయి. తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేనొకటంటా టైపుతో ఘోరంగా తిట్టుకోవడం కామనే. అయితే పరువు ప్రతిష్టలున్న అసెంబ్లీలో పెద్దగా తిట్టుకోరు, గొడవ పడరు. ఆ కొరతను తమిళనాడు సీఎం, గవర్నర్ తీర్చేశారు. ఇద్దరూ చట్టసభ సాక్షిగా గొడవపడ్డారు. దీంతో గవర్నర్ కోపంతో వాకౌట్ చేశారు. సోమవారం అసెంబ్లీలో గవర్నర్ ఆన్‌ఎన్ రవి ప్రసంగిస్తుండగా అధికార డీఎంకే ఎమ్మెల్యేలు గొడవ చేశారు. గవర్నర్ ప్రసంగంలో ఆరెస్సెస్‌కు అనుకూలమైన అంశాలున్నాయని అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వానికి, రవి మధ్య విభేదాలు ఉన్న నేపథ్యంలో ఆయన వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్ కల్పించుకున్నారు. తన ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగాన్ని మాత్రమే గవర్నర్ చదవాలని, దాన్నే రికార్డుల్లో పెట్టాలని, గవర్నర్ చెప్పిన వాటిని తీసేయాలని స్పీకర్‌ను కోరారు. ఆమేరకు తీర్మానం చేశారు. దీంతో గవర్నర్ సభ నుంచి వెళ్లిపోయారు.
గవర్నర్ ప్రసంగంలో ఏముంది?
రవి తన ప్రసంగంలో.. ప్రభుత్వం రాసిచ్చిన ప్రతిలోని ఓ పేరాను చదవలేదని అంటున్నారు. అంబేద్కర్, ద్రవిడ నేతలకు సంబంధించిన విషయాలను విస్మరించారని ఆరోపిస్తున్నారు. తమిళనాడుకు తమిళగం అనే పేరే బావుంటుందని గవర్నర్ తన ప్రసంగంలో అన్నారు. దీంతో డీఎంకేతోపాటు విపక్షాలు మండిపడ్డాయి. రవి రాష్ట్రంలో ఆరెస్సెస్ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారని, ద్రావిడ నేతలను అవమానిస్తున్నారని భగ్గుమన్నాయి. కొన్ని బిల్లుల విషయంలో రవి తమకు సహకరించడం లేదని ప్రభుత్వం కొన్నాళ్లుగా విమర్శిస్తోంది.