యూట్యూబర్‌కు 6నెలల జైలు శిక్ష..ఏమన్నాడంటే..
ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో అపార స్వేచ్ఛ ఉంటుందని, ఏమైనా చెప్పొచ్చని చాలామంది తమకు తోంచింది రాస్తుంటారు. తీసింది పోస్ట్ చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోని సమస్యలు ఎదురవుతుంటాయి. తిట్లు, బెదిరింపులు వంటివే కాదు, కేసులు కూడా మామూలే. అలాంటి ఓ కేసు చినికి చినికి గాలివానగా మారి జైలు శిక్ష పడేదాకా వెళ్లిపోయింది.
తమిళనాడుకు చెందిన ప్రముఖ యూట్యూబర్ ఎస్. శంకర్‌కు మదురై హైకోర్టు బెంచ్ ఆరు నెలల జైలుశిక్ష విధించింది. అతడు రెండు నెలల కిందట జడ్జీలను, న్యాయవ్యవస్థను తిడుతూ యూట్యూబ్‌లో ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. న్యాయ వ్యవస్థ అవినీతితో కుళ్లిపోయి చెడ కంపు కొడుతోందని మండిపడ్డాడు. అది కాస్తా వైరల్ కావడంతో కోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరిపింది. శంకర్ నిరాధార ఆరోపణలో న్యాయవ్యవస్థ పరువు తీశాడంటూ ఆరు నెలల జైలు శిక్ష వేసింది. అతడు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డమే కాక, క్షమాపణ చెప్పడానికి కూడా ఇష్టపడలేదని కోర్టు మండిపడింది.