మరణం అనేది ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందనేది ఎవరూ ఊహించలేరు. రోడ్డుపై వెళుతున్న వ్యక్తికి ఓ ట్రక్కు నుంచి ఊడిపోయిన టైరు తగలడంతో తీవ్రగాయాల పాలై మృతి చెందాడు. ఈ దుర్ఘటన తమిళనాడులోని శ్రీపెరంబుదూరు ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదం రోడ్డు పక్కనే షాపులో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది.సదరు వ్యక్తి రోడ్డు దాటుతున్న క్రమంలో టైరు వేగంగా దూసుకువచ్చి అతడిని బలంగా గుద్దింది. సమీపంలో ఉన్నవారు అతడిని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది, అక్కడి చేరుకున్న కొద్ది సమయంలో అతడు మరణించాడు. చనిపోయిన వ్యక్తిపేరు మురళి అని అతడు శ్రీపెరంబుదూరులోనే ఆటో రిక్షా డ్రైవర్‌గా పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. కిరాణ సామాన్లు తీసుకున్న మురళి ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈనెల 1 వ తేదిన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.