ఆ రైల్లో ఎవరికీ టికెట్లు లేవు - MicTv.in - Telugu News
mictv telugu

ఆ రైల్లో ఎవరికీ టికెట్లు లేవు

November 1, 2017

టికెట్ లేని రైలు ప్రయాణం నేరమని, జరిమానాలు వేస్తామని రైల్వే బోగీల్లో బోర్డులు కనిపిస్తుంటాయి. అయినా బీదాబిక్కీ అవేం లెక్క చేయకుండా టికెట్ లేకుండానే వెళ్తుంటారు.అలాంటి వాళ్లు రెండు మూడు బోగీల్లోనే.. అదీ టాయిలెట్ల పక్కన ప్రయాణిస్తుంటారు. అయితే తమిళనాడులో ఏకంగా ఒక రైల్లో ప్రయాణించిన దాదాపు వెయ్యిమంది టికెట్లు లేకుండా జర్నీ చేశారు. ఏదో రాజకీయ పార్టీ స్పాన్సర్ చేసిన రైలు కాదిది. పక్కా కమర్షియల్ రైలు. రామేశ్వరం- మదురై ప్యాసింజర్‌ రైల్లో బుధవారం ఈ వింత జరిగింది. తెల్లవారుజామున  5.30 గంటల రామేశ్వరం నుంచి ఈ రైలు వెళ్తుంది. అయితే స్టేషన్లోని టికెట్ కౌంటర్లో ఆ సమయంలో సిబ్బందెవరూ లేరు. మరోపక్క.. రైలు బయలుదేరుతోందని ప్రకటన. దీంతో ప్రయాణికులు చేసేదేమీ లేక టికెట్లు తీసుకోకుండా ఎక్కేశారు. 161 కి.మీ. ప్రయాణాన్ని ఉచితంగా చేసేశారు. దీనిపై రైల్వే శాఖ గుర్రుమంటోంది. రైల్లో పోయినవాళ్లనేమీ చేయలేక ఇక ఆ టికెట్లు ఇవ్వకుండా డుమ్మా కొట్టిన ఉద్యోగులపై చర్యలకు సిద్ధమైంది.