ఏడో పెళ్లికి సిద్ధపడిన భార్యను పట్టుకున్న ఆరో భర్త.. ఎక్కడంటే - MicTv.in - Telugu News
mictv telugu

ఏడో పెళ్లికి సిద్ధపడిన భార్యను పట్టుకున్న ఆరో భర్త.. ఎక్కడంటే

September 24, 2022

పెళ్లిలో నూతన దంపతులను అగ్ని చుట్టూ ఏడడుగులు ప్రదక్షిణ చేయిస్తారు. కానీ ఇక్కడ ఓ మహిళ మాత్రం దానిని వేరేలా అర్ధం చేసుకున్నట్టుంది. ఏకంగా ఆరుగురిని పెళ్లి చేసుకుంది. అంతటితో ఆగక ఏడో పెళ్లి చేసుకోబోతుండగా, ఆరో భర్త వచ్చి నిత్య పెళ్లి కూతురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. సాధారణంగా యువతుల లభ్యత తక్కువగా ఉండే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. కానీ, మన పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నమ్మక్కల్ జిల్లాలోని కల్లిపాళయం అనే గ్రామంలో దనపాల్ అనే యువకుడు నివాసం ఉన్నాడు. అతనికి ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా సెట్ కాకపోవడంతో పెళ్లిళ్ల బ్రోకర్ అయిన బాలమురుగన్ అనే వ్యక్తికి తన గోడును వెళ్లబోసుకున్నాడు. అంతావిని ధనపాల్‌కి ధైర్యం చెప్పిన బాలమురుగన్ నీకు పెళ్లి చేసే బాధ్యత నాదంటూ హామీ ఇచ్చాడు.

అనంతరం మధురైకి చెందిన సంధ్య అనే మహిళను చూపించి పెళ్లి సెట్ చేశాడు. అనంతరం ఈ నెల 7వ తేదీన ఓ గుడిలో పెళ్లి జరిపించాడు. సంధ్య తరపున అక్కాబావలంటూ ఇద్దరు వ్యక్తులు రాగా, దనపాల్ తరపున చాలామంది బంధువులు పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి సక్సెస్ ఫుల్‌గా జరుగగా, ధనపాల్ బాలమురుగన్‌కి కృతజ్ఞతగా లక్షన్నర రూపాయలు చెల్లించాడు. అంతా బాగుందనుకోగా, పెళ్లైన మూడో రోజుకే సంధ్య ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఎంత వెతికినా జాడ దొరకలేదు. బాలమురుగన్, సంధ్య అక్కాబావల ఫోన్ నెంబర్లు స్విచ్చాఫ్ అయ్యాయి. దీంతో ధనపాల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత కొన్ని రోజులకు బ్రోకర్ బాలమురుగన్ సంధ్య ఫోటోను ధనపాల్ బంధువుకు చూపించి పెళ్లి చేస్తానని హామీ ఇవ్వగా, సంధ్యను గుర్తు పట్టిన ఆ బంధువు ధనపాల్ కుటుంబానికి సమాచారమిచ్చాడు. వారు గుట్టుగా ఉండి పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తే పెళ్లి రోజు ఉన్నఫళంగా పట్టుకుంటామని చెప్పగా ఆ బంధువు అలాగే చేశాడు. తీరా పెళ్లి రోజు రానే వచ్చింది. మళ్లీ ఫ్రెష్‌గా పెళ్లికూతురి డ్రెస్సులో సంధ్య, ఆమె అక్కాబావలు, బ్రోకర్ బాలమురుగన్‌లు మండపానికి వచ్చేశారు. అక్కడే మాటున దాగి ఉన్న ధనపాల్ కుటుంబసభ్యులు వారిని పట్టుకొని చితకబాదారు. అనంతరం వాళ్లను పోలీసులకు అప్పగించగా, విచారణలో విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. సంధ్యకు ఇప్పటికే ఆరు పెళ్లిళ్లు అవగా, ఆరుగురు భర్తలను మోసం చేసి, నగదు తీస్కోని పరారైందని తేలింది. అటు పెళ్లి నెపంతో చాలా మంది వద్ద లక్షల రూపాయలు వసూలు చేశారు ఈ ముఠా. అయితే సంధ్య మాత్రం తన కుమారుడిని కిడ్నాప్ చేస్తానని బెదిరించి ఇన్ని పెళ్లిళ్లు చేశారని వాపోయింది. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, ఈ ఘటన మాత్రం తమిళనాడులో కలకలం రేపింది.