వామ్మో.. ఏకంగా నకిలీ SBI బ్రాంచినే పెట్టేశారు..  - MicTv.in - Telugu News
mictv telugu

వామ్మో.. ఏకంగా నకిలీ SBI బ్రాంచినే పెట్టేశారు.. 

July 11, 2020

Tamil Nadu Three arrested for running ‘duplicate’ SBI bank branch

రోజరోజుకు కేటుగాళ్లు ఎంత ముదిరిపోతున్నారంటే.. అమాయక ప్రజలను మోసం చేయడానికి కొత్త కొత్త దారులు వెదుకుతున్నారు. ఏకంగా ఓ నకిలీ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) శాఖను పెట్టేసి గల్లాపెట్టె తెరిచేశారు. ఎవరు పసిగట్టరులే.. ఆలోపు జనాలను అందినకాడికి దోచుకోవాల్సిందేనని అనుకున్నారు. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ నకిలీ బ్యాంక్  కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక నిందితుని తల్లిదండ్రులు ఇద్దరూ బ్యాంకు మాజీ ఉద్యోగులు. 

ఈ ఘటన గురించి పన్రుటి ఎస్సై  అంబేద్కర్ మాట్లాడుతూ.. ‘నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ కేసులో శుక్రవారం ముగ్గుర్ని అరెస్టు చేశాం. ఈ మోసంలో ప్రధాన సూత్రధారిగా కమల్ బాబు ఉన్నాడు. కమల్ తల్లిదండ్రులు బ్యాంకు మాజీ ఉద్యోగులు. కమల్ తండ్రి పదేళ్ళ క్రితం మరణించారు. తల్లి రెండేళ్ళ క్రితం బ్యాంకు ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందారు. కమల్ బాబు నిరుద్యోగి కాగా, మరొక నిందితుడు ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నాడు. నకిలీ బ్యాంకు రశీదులు, చలానాలు, ఇతర పత్రాలను ఈ ప్రింటింగ్ ప్రెస్‌లోనే ముద్రించేవారు. మూడో నిందితుడు రబ్బర్ స్టాంపులను తయారు చేస్తుంటాడు. ఈ ముగ్గురూ అసలు సిసలు బ్యాంకు శాఖను తలపించేలా సెట్టింగులు వేశారు. అదృష్టవశాత్తు ఇక్కడి నుంచి ఎలాంటి లావాదేవీలు జరగలేదు. ఈ నకిలీ శాఖలో ఎవరూ సొమ్ము నష్టపోలేదు. నిందితులు ముగ్గుర్నీ కోర్టులో హాజరుపరచాం’ అని తెలిపారు.

ఓ కస్టమర్‌కు అనుమానం రావడంతో ఈ నకిలీ బ్యాంక్ బండారం బయటపడింది. ఈ నకిలీ ఎస్‌బీఐ బ్రాంచ్‌ని మూడు నెలల క్రితం ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. పన్రుటిలో ఈ బ్రాంచ్ పట్ల ఓ ఎస్‌బీఐ కస్టమర్‌కు అనుమానం కలగడంతో అతను వెంటనే తన ఖాతా ఉన్న బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ దృష్టికి ఈ విషయాన్ని తెలిపారు. బ్రాంచ్ మేనేజర్ జోనల్ ఆఫీసుకు ఈ విషయాన్ని తెలియజేశారు. పన్రుటిలో కేవలం రెండు బ్రాంచ్‌లు మాత్రమే పని చేస్తున్నాయని, మూడో శాఖ లేదని జోనల్ కార్యాలయం స్పష్టంచేసింది. ఎస్‌బీఐ అధికారులు సదరు నకిలీ బ్రాంచ్‌ను సందర్శించి, అందులోని సెట్టింగ్‌లను చూసి ఆశ్చర్యపోయారని చెప్పారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ముగ్గుర్ని అరెస్టు చేశామని వివరించారు.