దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో జాత్యహంకార దాడి జరిగింది. ఉత్తరాది నుంచి పొట్టకూటి కోసం వచ్చిన కార్మికులను ఓ తమిళుడు దూషిస్తూ దుర్మార్గంగా దాడి చేసిన దృష్యాలు నెట్టింట్ వైరల్ అవుతోంది. ఈ ఘటనతో తమిళులకు హిందీపై ఉన్న వ్యతిరేకత మరోసారి స్పష్టంగా రుజువైందని, ఈ జాడ్యం రాజకీయ పార్టీలను దాటి సాధారణ పౌరులకు పాకిందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకెళితే.. కిక్కిరిసిన ప్రయాణీకులతో వెళ్తున్న ఓ రైలులో ఓ వ్యక్తి తమిళ్ మాట్లాడుతూ కొందరిని పలకరించాడు. అయితే అందులో ఉత్తరాది వలస కార్మికులకు తమిళ్ రాకపోవడంతో వేరే భాషలో సమాధానమిచ్చారు. దీంతో కోపం తెచ్చుకున్న సదరు వ్యక్తి.. దుర్భాషలాడుతూ వారిపై దాడికి దిగాడు. కొడుతూ, జుట్టు లాగుతూ వారిని బండ బూతులు తిట్టాడు. వారు మొత్తం నలుగురు ఉన్నా ఎదురు తిరిగే ప్రయత్నం చేయలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన తమిళుడు.. ఏదో తన ఆస్తి దోచుకోవడానికి వచ్చినంత బిల్డప్ ఇస్తూ అమానవీయంగా ప్రవర్తించాడు. ఇదంతా రైట్ వింగ్ సపోర్టర్ కార్తీక్ గోపీనాథ్ వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయి రైల్వే అధికారుల దృష్టికి వెళ్లింది. దాడి చేసిన తమిళుడిపై ఐపీసీ సెక్షన్ 153ఏ, 323, 294 బీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక వీడియో కింద నెటిజన్లు కార్మికులకు మద్ధతుగా కామెంట్లు చేస్తున్నారు. ఉత్తరాదిన కూడా దక్షిణాది వారు పని చేస్తున్నారని ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నారు. అలాగే యూట్యూబ్ సీఈవోగా నియమితులైన నీల్ మోహన్‌ని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్న భారతీయుల పట్ల అక్కడి స్థానికులు ఇదే ధోరణితో వ్యవహరిస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని సూచిస్తున్నారు. కాగా, తమిళనాడులో మొదటి నుంచీ హిందీ వ్యతిరేకత ఉంది. రాష్ట్రంలో హిందీ అమలు చేయాలనే కేంద్రం ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. మరోవైపు ఈ వ్యతిరేకత కేవలం హిందీ భాషమీదే కాదని, దక్షిణాది భాషల మీద కూడా ఉందంటున్నారు నెటిజన్లు. కాకపోతే హిందీ వ్యతిరేకత తరచూ వార్తల్లో నిలవడంతో ఈ విషయం ఎక్కువగా బయటపడలేదని అంటున్నారు. తమిళం రాని తెలుగు, కన్నడ, మలయాళ భాషల వ్యక్తులు వెళ్లినా ఇలాంటి వ్యక్తులు ఇలాగే ప్రవర్తిస్తారంటూ తాము ఎదుర్కొన్న సంఘటనలను గుర్తు చేస్తున్నారు.