షూటింగులు లేవు.. సీరియళ్లలో నటించే అన్నాచెల్లెలు ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

షూటింగులు లేవు.. సీరియళ్లలో నటించే అన్నాచెల్లెలు ఆత్మహత్య

June 6, 2020

TV Artists

కరోనా ఎందరో పొట్టను కొట్టడమే కాదు, ఎందరో జీవితాలను చిదిమేస్తోంది. మంచిమంచి వాళ్లు కూడా కరోనా స్ట్రోక్‌ను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. ముంబయి, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో టీవీ నటులు షూటింగులు లేక, చేతిలో డబ్బుల్లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరేమో కరోనా సోకి మృతిచెందుతున్నారు. తాజాగా తమిళనాడులోని చెన్నైలో టీవీ సీరియల్స్‌లో నటించే అన్నాచెల్లెళ్లు శ్రీధర్, జయ కళ్యాణి ఆత్మహత్య చేసుకున్నారు. వారు నివసిస్తున్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి డోర్ పగలగొట్టి చూడగా, అందులో అన్నాచెల్లెళ్ల మృతదేహాలు కుళ్లిన స్థితిలో దర్శనమిచ్చాయి. 

చెన్నైలోని కొడంగయ్యూర్‌లో ఉన్న వారి ఇంట్లోనే వారు ఆత్మహత్య చేసుకుని కొన్ని రోజులు అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కొన్ని తమిళ సీరియల్స్‌లో వారిద్దరు నటించి ఇప్పుడిప్పుడే మంచి పేరు సంపాదించుకుంటున్నారు. అయితే కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా వారికి ఉపాధి దొరకలేదని, ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. వారు ఆత్మహత్య చేసుకున్నట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.