కిడ్నీ ఇచ్చి ప్రాణం పోసిన తల్లిని గెంటేసిన కొడుకు.. - MicTv.in - Telugu News
mictv telugu

కిడ్నీ ఇచ్చి ప్రాణం పోసిన తల్లిని గెంటేసిన కొడుకు..

November 17, 2019

తనకు మూత్రపిండం దానం చేసి మరీ బతికించిన తల్లిదండ్రులను భార్యతో కలిసి రోడ్డున పడేశాడు ఓ కొడుకు. ఈ విచారకర ఘటన తమిళనాడులో జరిగింది. కృష్ణగిరి జిల్లాకు చెందిన పెరియస్వామి, శకుంతల దంపతుల కొడుకు అరుణ్‌కుమార్‌కు మూత్రపిండాల సమస్య తలెత్తింది. మూత్రపిండ మార్పిడి చేయాలని గతంలో వైద్యులు తెలిపారు. కిడ్నీ దానం చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడంతో శకుంతల తన మూత్రపిండాన్ని ఇచ్చి కొడుకును కాపాడుకున్నారు.

tamilandu.

ఆ తర్వాత కొడుక్కి ఘనంగా పెళ్లి చేసి కృష్ణగిరిలో ఉన్న సుమారు రూ.3 కోట్ల విలువైన ఆస్తులను అతడి పేరిట రాశారు. ఇంత చేసినా తల్లిదండ్రుల ప్రేమను గుర్తించని అరుణ్ తన భార్యతో కలిసి వారిని పట్టించుకోవడం మానేశాడు. కొన్నాళ్ల క్రితం ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. దిక్కుతోచని స్థితిలో వారు వృద్ధాశ్రమంలో చేరారు. కొడుకు ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురై, అతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు పిటిషన్‌ ఇచ్చారు. ఈ సంఘటనపై ఆర్డీవో దైవనాయకి పలు కోణాల్లో విచారణ చేపట్టి అరుణ్‌ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఆ వృద్ధ దంపతుల పేరిట మార్పించి, సంబంధిత పత్రాలను అందించారు. తల్లిదండ్రులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని అరుణ్‌ను అధికారులు హెచ్చరించారు.