బంగ్లాలో ఉన్న ముఖ్యమంత్రిని వరద ప్రాంతాలకి రప్పించా.. గవర్నర్ - MicTv.in - Telugu News
mictv telugu

బంగ్లాలో ఉన్న ముఖ్యమంత్రిని వరద ప్రాంతాలకి రప్పించా.. గవర్నర్

October 21, 2022

 

Tamilisai defends actions in Telangana, Puducherry; maintains she is not interfering in governance

వరద బాధిత ప్రాంతాలకు తెలంగాణ ముఖ్యమంత్రిని రప్పించిన పేరు తనకి ఉందని తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. తాను వెళ్తున్నానని తెలిశాక ఆ ప్రాంతానికి సీఎం వెళ్తారని చెప్పారు. గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విని చేప‌ట్టి మూడేళ్లైన సంద‌ర్భంగా త‌మిళిసై రీ డిస్క‌వ‌రింగ్ సెల్ప్ ఇన్ సెల్ఫ్‌లెస్ స‌ర్వీస్ పేరుతో ఓ పుస్త‌కాన్ని ర‌చించారు. ఈ పుస్త‌కాన్ని చెన్నైలో ఆవిష్క‌రించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవం రోజున తనని జెండా ఆవిష్కరించనివ్వలేదని, ప్రసంగం కూడా చేయనివ్వలేదని చెప్పారు. అయినా తన పని తాను చేసుకుంటూ పోతున్నానన్నారు. గవర్నర్‌ హోదాలో ప్రత్యేక హెలికాప్టర్‌, ప్రత్యేక విమాన సేవలు పొందే అధికారమున్నా తానెప్పుడూ వాటిని వినియోగించలేదన్నారు. తింటున్న భోజనానికి కూడా తెలంగాణ రాజ్‌భవన్‌కి నగదు చెల్లిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

తెలంగాణలో తాను ఎలాంటి రాజకీయాలు చేయడం లేదని, రాజ్యంగ సంరక్షకురాలిగా తన బాధ్యతల్ని మాత్రం నెరవేరుస్తున్నానని తెలిపారు. కానీ కొందరు తన పనులకు ఆటంకం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు వ్యతిరేకించినా తాను చేయదలచుకున్న పని ఆగదని స్పష్టం చేశారు. తనకు ప్రజా శ్రేయస్సే ముఖ్యమని, ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని పేర్కొంటూ భద్రాచలంలో జరిగిన ఓ ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. వరదల సమయంలో ప్రజలను ఆదుకునేందుకు తాను భద్రాచలం వెళుతున్నానని మీడియా ద్వారా తెలుసుకుని, అప్పటి వరకూ ఏమాత్రం పట్టించుకోకుండా బంగ్లాలో ఉన్న ముఖ్యమంత్రి.. హడావిడిగా బాధిత ప్రాంతాలకు బయలుదేరారన్నారు.