దేవాలయాల్లోకి, ప్రార్ధనా మందిరాల్లోకి ప్రవేశించే సమయంలో పాదరక్షలను విడిచే ఆ పవిత్ర స్థలాన్ని సందర్శించుకుంటారు చాలామంది. ఆయా మత విశ్వాసాలకు అనుగుణంగా, సాంప్రదాయాలను పాటించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఓ గ్రామం మాత్రం తమ ఊరు మొత్తాన్ని పవిత్రస్థలంగా భావిస్తోంది. ఆ గ్రామంలోని భూమిపై ఎవరూ చెప్పులు వేసుకోరు. కాదని ఊర్లో ఎవరైన చెప్పులు వేసుకుని తిరిగితే వారు శిక్షార్హులుగా పరిగణిస్తారు.
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి 450 కిలోమీటర్ల దూరంలో అండమాన్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో దాదాపు 130 కుటుంబాలు నివసిస్తుండగా, వారిలో ఎక్కువ మంది రైతులే. గ్రామ ప్రవేశ ద్వారం వద్ద ఒక పెద్ద చెట్టు ఉంటుంది. దానికి ఊరంతా పూజలు చేస్తారు. ఆ చెట్టు దాటి ఎవరూ గ్రామంలో చెప్పులు ధరించి వెళ్లడానికి అనుమతి లేదు. బయటి నుంచి ఎవరైనా గ్రామానికి వస్తున్నారంటే ఇక్కడే చెప్పులు వదిలేసి వెళ్లాల్సిందే. అంతే కాకుండా గ్రామంలో కూడా ప్రజలు చెప్పులు లేకుండానే తిరుగుతుంటారు. చెప్పులు వేసుకుని రోడ్డుపై నడిస్తే దేవుడికి కోపం వస్తుందని గ్రామస్తులు అంటున్నారు. ఇక్కడ నివసించే దాదాపు 500 మందిలో వృద్ధులు మాత్రమే మధ్యాహ్నం వేడిగా ఉన్నప్పుడు బూట్లు, చెప్పులు ధరించి నడవడానికి అనుమతిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఇవి కాకుండా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే పంచాయతీ వారికి శిక్ష విధిస్తుంది.