జూబ్లీహిల్స్​​ ఘటనపై తమిళిసై​ సీరియస్.. మరో రెండు రోజుల్లో - MicTv.in - Telugu News
mictv telugu

జూబ్లీహిల్స్​​ ఘటనపై తమిళిసై​ సీరియస్.. మరో రెండు రోజుల్లో

June 5, 2022

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్నఅమ్నీషియా పబ్‌కు వెళ్లిన ఓ మైనర్ బాలికను కొంతమంది యువకులు పరిచయం చేసుకొని, బాలికను కారులో బయటకు తీసుకెళ్లి, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఎంత వైరల్ అవుతోందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. ‘ఈ ఘటన నన్ను ఎంతగానో కలిచివేసింది. ఈ ఘటనకు సంబంధించిన ప్రతి మీడియా కథనాలను నేను పరిశీలిస్తున్నాను. కేసుకు సంబంధించిన పూర్తి నివేదికను మరో రెండు రోజుల్లోగా అందించాలి’ అంటూ ఆమె సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు

తాజాగా అమ్నీషియా పబ్ నుంచి బాలికను ఐదుగురు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన మూడు రోజులకు బాధిత బాలిక తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నాయి. మొదట్లో హోం మంత్రి మహమూద్ అలీ మనవడు ఉన్నాడని ఆరోపణలు వచ్చినా, వాటిని పోలీసులు ఖండించారు. ఇటు ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడన్న ఆరోపణలు వచ్చాయి. నిన్న వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కుమారుడు సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సంచలనంగా మారడంతో గవర్నర్ తీవ్రంగా స్పందించారు. నిందితులు ఎక్కడ ఉన్న వారిని వెతికి పట్టుకోవాలని, రెండు రోజుల్లో పూర్తి నివేదికను అందజేయాలని కోరారు.