Tammineni Koteswara Rao was responsible for the murder of Tammineni Krishnaiah, alleged wife mangatayamma.
mictv telugu

‘నా భర్త హత్యకు తమ్మినేని వీరభద్రం సోదరుడే కారణం’.. మృతుడి భార్య

August 16, 2022

తన భర్త తమ్మినేని కృష్ణయ్య హత్యకు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావే కారణమని భార్య మంగతాయమ్మ ఆరోపించారు. రాజకీయంగా ఎదుగుతున్న తమ కుటుంబాన్ని చూసి ఓర్వలేకే ఈ హత్యకు పాల్పడ్డారని అన్నారు. గ్రామంలో తమ ఆధిపత్యానికి కృష్ణయ్య చెక్ పెట్టాడనే అక్కసుతోనే తమ్మినేని వీరభద్రం, ఆయన సోదరుడు కోటేశ్వరరావులు ఈ హత్యకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. గతంలో రెండు దఫాలు సీపీఎం నుండి తమ్మినేని కృష్ణయ్యను సస్పెండ్ చేయించారని, తాము సర్పంచ్ పదవికి పోటీకి నామినేషన్ వేస్తే విత్‌డ్రా చేసుకోవాలని బెదిరించారన్నారు.

గ్రామంలో తమ్మినేని కోటేశ్వరరావు, ఆయన సోదరుడు వీరభద్రం అవినీతికి వ్యతిరేకంగా కృష్ణయ్య పోరాటం చేయడంతో ఆయనను కక్షగట్టి సస్పెండ్ చేశారని ఆమె ఆరోపించారు. రెండో దఫా పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి విజయం సాధించినట్టుగా చెప్పారు. సీపీఎం నాయకుల హత్య రాజకీయాలు, అక్రమాలను చూసే తాము పార్టీ నుంచి బయటకొచ్చామని తెలిపారు. హత్యలు చేస్తే బెదిరిపోయే రోజులు పోయాయని, ఇలాంటి ఘటనల వల్ల తమ కుటుంబం భయపడదని చెప్పారు. తాము ప్రజల కోసం పని చేశామని, ప్రజలు తమ వెంటే ఉంటారని వెల్లడించారు. హత్యకు పాల్పడిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి కృష్ణయ్య కొడుకు నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇండిపెండెంట్ గా విజయం సాధించిన తర్వాత కృష్ణయ్య టీఆర్ఎస్ లో చేరారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రధాన అనుచరుడుగా కొనసాగుతున్నారు.