Tammineni Veerabhadram was the mastermind behind her father's murder: Krishnaiah daughter
mictv telugu

మా నాన్న హత్యలో తమ్మినేని వీరభద్రమే సూత్రదారి… కృష్ణయ్య కూతురు

August 21, 2022

 

ఖమ్మం జిల్లాలో తెల్దారుపల్లిలో జరిగిన రాజకీయ హత్య సంచలనాలను కలిగించింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అయితే ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న కోటేశ్వరరావును మాత్రం ఏ9లో చేర్చారు. ఎఫ్‌ఐఆర్ లో ప్రధాన ముద్దాయిగా ఉన్న వ్యక్తిని చివరలో చేర్చడం మునుగోడు ఎన్నికల ప్రభావమేనని చర్చ సాగుతుంది.

ప్రస్తుతం పరారీలో కోటేశ్వరరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రి తమ్మినేని కృష్ణయ్య హత్యపై ఆయన కూతురు రజిత షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి హత్య చేయించడంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రమే సూత్రధారి అని చెప్పారు. వీరభద్రం ఆదేశాల మేరకే హత్య జరిగిందని, హత్యలో ఉన్న వాళ్లంతా సీపీఏం పార్టీకి చెందిన వారేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్య కేసులో సీపీఎం కార్యకర్తలు ఎవరు లేరని వీరభద్రం తప్పుడు మాటలు చెబుతున్నారన్నారు.

అయితే పోలీసులు ఈ కేసులో సరైన విచారణ చేపట్టడం లేదని, తన ఇంట్లో వ్యక్తి చనిపోతే.. తమకు కాకుండా తమ్మినేని వీరభద్రానికి సెక్యూరిటీ ఇవ్వడమేంటి? ప్రశ్నించారు రజిత. తన తండ్రి హత్య కేసులో ప్రధాన నిందితులైన కోటేశ్వరరావు, లింగయ్యను దాచిపెట్టింది పోలీసులేనని ఆరోపించారు. తమ గ్రామానికి సెక్యూరిటీ కల్పించి ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలని కోరారు. మంత్రి కేటీఆర్ స్పందించి తమకు న్యాయం చేయాలని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆమె అన్నారు.