విభిన్న పాత్రల్లో నటించి, సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందించే బాలీవుడ్ హీరోయిన్ స్వరాభాస్కర్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తన స్నేహితుడు కం ప్రియుడు ఫహద్ అహ్మద్‌ను జనవరి 6న రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంది. ఈ విషయాన్ని ఆమెనే గురువారం సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా వెల్లడించింది. అందులో తమ పరిచయం, స్నేహం, ప్రేమ, పెళ్లి వరకు సాగిన ప్రయాణాన్ని ఓ వీడియో ద్వారా వివరించింది. తన భర్త రాజకీయ వ్యూహకర్త, సమాజ్ వాదీ పార్టీ నాయకుడని తెలిపింది. ‘ప్రేమ కోసం వెతికినప్పుడు మొదట స్నేహం ఎదురవుతుంది. ఆ తర్వాతే అది ప్రేమతో ముగుస్తుంది. ఈ ప్రయాణంలో ఒకరినొకరం తెలుసుకున్నాం. చివరగా నా ప్రేమ నాకు దొరికేసింది. వెల్‌కమ్ టు మై హార్ట్ ఫహద్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.