నందమూరి నటుడు తారకరత్న(Taraka Ratna)ఆరోగ్యపరిస్థితిపై కుటుంబ సభ్యుల్లోనూ, ఇటు అభిమానుల్లో ఆందోళన కొనసాగుతుంది. వారం రోజుల కిందట లోకేష్ యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉండడం కలవరపెడుతోంది. తారకరత్నను రక్షించేందుకు వైద్యులు అహర్నిషలు కృషి చేస్తున్నారు. అత్యాధునికమైన వైద్యాన్ని అందిస్తున్నారు. శుక్రవారం మెదడుకు స్కానింగ్ చేసిన ఆస్పత్రి వర్గాలు రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నారు. వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అవసరమైతే తారకరత్నను విదేశాలకు తరలించాని కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. నిన్న తారకరత్నను చూసేందుకు ఆస్పత్రికి వచ్చిన టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. తారకరత్నను ఏ క్షణమైనా ఎయిర్ అంబులెన్సులో విదేశాలకు తరలించే అవకాశం ఉందని తెలిపారు.
తారకరత్న ఆరోగ్యపరిస్థితిని బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు. గత వారం రోజులుగా బెంగళూరులోనే ఉండి నారాయణ హృదయాలయలో వైద్యుల బృందంతో మాట్లాడి పరిస్థితిన అడిగి తెలుసుకుంటున్నారు. తారకరత్న ఆరోగ్యం కోసం బాలయ్య చిత్తూరులోని మృత్యుంజయ ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఇక తారకరత్నను విదేశాలకు తీసుకువెళ్తే బాలకృష్ణ కూడా వెంట వెళ్తారని తెలుస్తోంది. తారకరత్న యోగక్షేమాలు చూసుకునేందుకు ఎయిర్ అంబులెన్సులో బాలకృష్ణ వెళ్లనున్నట్టు సమాచారం.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నందమూరి లోకేష్ గత నెల 27న చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. కాసేపు నడిచాక ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.అనంతరం ఆయనను కుప్పం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తర్వాత బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. తారకరత్న త్వరగా కోలుకుంటారని అభిమానులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.