టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన నటుడు తారకరత్నకు చికిత్స కొనసాగుతుంది. గత 20 రోజులుగా బెంగళూరులోని హృదయాలయా ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వైద్యులు తారకరత్న ఆరోగ్యపరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తాజాగా మరోసారి తారకరత్న హెల్త్ అప్డేట్ వచ్చింది. గురువారం తారకరత్నకు ఎంఆర్ఐ(MRI) స్కానింగ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై హెల్త్ బులెటిన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తారకరత్న ఆరోగ్యపరిస్థితి మరింత దిగజారినట్టు తెలుస్తోంది. దీని కారణంగానే మరోసారి ఎంఆర్ఐ(MRI)స్కానింగ్ తీశారని సమాచారం. మధ్యలో కాస్త కోలుకుంటున్నట్లు కనిపించినా ఇప్పుడు పరిస్థితి క్షీణించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి వచ్చే తదుపరి హెల్త్ బులెటిన్ పై ఉత్కంఠ నెలకొంది.
జనవరి 27న నారాలోకేష్ కుప్పం వేదికగా యువగళం పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. కాసేపు లోకేష్‌తో పాటు కాసేపు నడిచి స్పృహ తప్పి కిందపడిపోయారు. తారకరత్నను హుటాహుటీన కుప్పం లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు షిఫ్ట్ చేశారు. ఆయనకు విదేశీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. హృద్రోగంతో పాటు నాడీ సమస్యలకు వైద్యం కొనసాగుతుంది.