తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించారు. అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఫిలిం ఛాంబర్లో ఉంచనున్నారు. అనంతరం అంతిమయాత్ర జరగనుంది. సాయంత్రం మహా ప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నందమూరి కుటుంబసభ్యులందరూ ఫిలిం ఛాంబర్‌కు తరలివచ్చారు. తారకరత్న భౌతికకాయం వద్ద ఆయన భార్య అలేఖ్యారెడ్డి, పిల్లలు విషాదంతో కూర్చొన్నారు. తారకరత్న తండ్రి మోహనకృష్ణ..కుమారుడి పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు.
హీరో బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న పార్థివదేహం వద్దే ఉన్నారు. దగ్గరుండి అవసరమైన ఏర్పాట్లను చూస్తున్నారు. సినీ,రాజకీయ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చి తారకరత్నకు తుది నివాళులర్పిస్తున్నారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనవరి 27న కుప్పం వెళ్లిన ఆయన.. అక్కడ గుండెపోటుకు గురయ్యారు. సుమారు 23 రోజుల పాటు చావుతో పోరాడి బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. ప్రేమపెళ్లి చేసుకున్న తారకరత్న, అలేఖ్యరెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి ఇంగ్లీష్ అక్షరాలను కలిపితే తాత ఎన్టీఆర్ పేరు వస్తుంది. తాతపై ఉన్న అభిమానంతో ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు తారకరత్న నామకరణం చేశారు.