హిజాబ్ ఆందోళనలు.. జైలు నుంచి విడుదలైన హీరోయిన్
ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు మద్దతు తెలినందుకు హీరోయిన్ తరనేహ్ అలిదూస్తి(38)ను అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ అల్లర్లు సృష్టించేందుకు కారణమవుతున్నారన్న ఆరోపణలతో ఆమెపై ఈ చర్యలు తీసుకుంది. తాజాగా ఎట్టకేలకు ఆమె జైలు నుండి విడుదలయింది. గత నెల డిసెంబర్‌లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అయితే 18 రోజుల తర్వాత ఆమెకు అధికారులు బెయిల్ మంజూరు చేశారు.
2016 ఆస్కార్ గెలుపొందిన ‘ది సేల్స్‌మ్యాన్’ సినిమాలో అలిదూస్తి నటించారు. పలు టీవీ షోలలో కూడా కనిపించారు. గతంలో ఇరాన్ సినీ పరిశ్రమలో జరిగిన మీటూ ఉద్యమంలో అలిదస్తీ పాల్గొన్నారు. ఆమెను జైలు నుంచి విడుదల చేయాలని ప్రపంచ వ్యాప్తంగా 600 మంది నటీనటులు బహిరంగ లేఖపై సంతకాలు చేశారు. ఈ క్రమంలో ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు.