Home > Featured > ‘మీకు మాత్రమే చెప్తా’ అంటున్న అర్జున్ రెడ్డి

‘మీకు మాత్రమే చెప్తా’ అంటున్న అర్జున్ రెడ్డి

టాలీవుడ్ యువ కెరటం విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్‌ల పేర్లు చెప్పగానే మనకు గుర్తుకువచ్చే సినిమా ‘పెళ్లిచూపులు’. ఆ సినిమాతో ఒకరు హీరోగా, మరొకరు దర్శకుడిగా వెండితెరపై మాయ చేశారు. ఆ తర్వాత ఇద్దరి ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. మరి ఈ కాంబినేషన్ మళ్లీ పునరావృతం అయితే ఎలా వుంటుంది? ఇప్పటికే విజయ్ అభిమానులు ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. మరింకేం ‘మీకు మాత్రమే చెప్తా’ పేరుతో సినిమాను మొదలు పెట్టేస్తున్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ రివర్స్ అయింది. దర్శకుడిగా వున్న తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుంటే.. విజయ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

కొత్త వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన ‘కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌’ పేరుతో ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్‌పై రూపొందుతున్న తొలి సినిమా ఇదే. ఈ సినిమా టైటిల్‌ను బుధవారం విడుదల చేశారు. సరదాగా విజయ్, తరుణ్ భాస్కర్‌లు కలిసి ఓ వీడియో రూపంలో చెప్పారు. క్రికెట్ ఆడుతున్న తరుణ్‌కు విజయ్ ఫోన్ చేసి ‘తరుణ్‌ ఎక్కడున్నావ్‌ రా.. ఇప్పుడే ఓ స్క్రిప్టు విన్నా, మస్తుగా ఉంది. నచ్చింది, బాగా నవ్వుకున్నా. ఆ డైరెక్టర్‌, టీంను చూస్తే ‘పెళ్లి చూపులు’ సమయంలో మనమే గుర్తొచ్చాం’ అని విజయ్‌ చెప్తాడు. హీరో ఎవరు అని తరుణ్ అడగ్గా.. నువ్వే హీరోవి.. టైటిల్ మీకు మాత్రమే చెప్తా.. అని విజయ్ చమత్కరిస్తాడు.

ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ‘సినిమాలలోకి రావడానికి, ఓ సినిమా తీయడానికి మేం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. సక్సెస్‌ అయ్యాక నిర్మాణ సంస్థను స్థాపించాలని ఆరోజే నిర్ణయించుకున్నా. ఇది ఎంత కష్టమో అర్థమైంది. కానీ సవాళ్లులేని జీవితానికి అర్థం లేదు. అందుకే ‘కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌‌’ బ్యానర్ స్థాపించి, మొదటి సినిమా టైటిల్‌ ప్రకటిస్తున్నా’ అని విజయ్‌ తెలిపాడు. ఇద్దరి సరికొత్త కాంబినేషన్ మళ్లీ వెండితెరను మెస్మరైజ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు.

Updated : 28 Aug 2019 10:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top