Tata group talks with Taiwanese company to manufacture iPhone
mictv telugu

ఐఫోన్ తయారీలో టాటా గ్రూప్.. తైవాన్ కంపెనీతో చర్చలు!

September 9, 2022

కీలక రంగాల్లో ఇప్పటికే పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న టాటా గ్రూప్ మరో ముఖ్యమైన విభాగంలోకి ప్రవేశించనుంది. ప్రముఖ మొబైల్ కంపెనీ యాపిల్‌ సంస్థకు చెందిన ఐఫోన్ తయారీలో అడుగుపెట్టనుంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. తైవాన్ కంపెనీ విస్ట్రన్ కార్పొరేషన్‌తో జరిగిన చర్చలు ఫలించే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ రెండు కంపెనీలు కలిసి భారత్‌లో జాయింట్ ఎలక్ట్రానిక్ వెంచర్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాయని వివరించింది. అయితే దీనిపై ఇరు కంపెనీల ప్రతినిధులు ఇంతవరకు స్పందించలేదని స్పష్టం చేసింది. కాగా, ఐఫోన్లను విస్ట్రన్ కార్పొరేషన్, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ సంస్థలు చేపడుతున్నాయి. ఇప్పటివరకు చైనాలో తయారీ చేపట్టగా, కరోనా, లాక్ డౌన్ ఆంక్షలు, అమెరికా, తైవాన్‌లతో ఘర్షణ వైఖరులతో అక్కడ్నుంచి చాలా కంపెనీలు తరలివెళ్తున్నాయి. ఈ సమయంలో వాటికి భారత్ వంటి ప్రజాస్వామ్య దేశం ఆకట్టుకుంటోంది. దీంతో పెట్టుబడులు వెల్లువలా వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ డీల్ కనుక విజయవంతం అయితే టాటా గ్రూప్ స్మార్ట్ ఫోన్ తయారీలో అడుగుపెట్టినట్టు అవుతుంది.