దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిరిండియాను 70 ఏళ్ల తర్వాత తిరిగి దక్కించుకున్న టాటాలు దూకుడు పెంచారు. ఈ సంస్థను వరల్డ్ క్లాస్ లెవర్లో తీర్చిదిద్దడానికి భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా ఏకంగా 500 విమానాలను కొనుగోలు చేయనున్నారు! ఈ డీల్‌కు సంబంధించిన వార్తలతో ఏవియేషన్ మార్కెట్ హోరెత్తిపోతోంది. ఇది సాకారమైతే ప్రపంచంలోనే అతిపెద్ద ప్లేన్ల డీల్‌గా చరిత్రకెక్కుతుంది.
ఎవరి నుంచి..
వివిధ కథనాల ప్రకారం.. ప్రఖ్యాత విమానాల తయారీ కంపెనీలైన బోయింగ్, ఎయిర్‌బస్ కంపెనీల నుంచి ప్లేన్లను టాటాలు కొననున్నారు. దీని కోసం రూ. 12 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించారు. కొనబోయే విమానాల్లో 430 నారోబాడీ, 70 వైడ్‌బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. 240 ఏ320 నియో, 40 ఏ350, 190 740 మాక్స్, 20 787, 10 777ఎక్స్ వంటి వెరైటీలు ఇందులో ఉన్నాయి. గత శుక్రవారం ఎయిర్‌బస్‌తో, గత నెల 29న బోయింగ్‌తో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. కొనుగోలుపై టాటాలు వచ్చేవారం ప్రకటన చేయనున్నారు. విమానాలను ఏడెనిమిదేళ్ల వ్యవధిలో కంపెనీలు టాటాలకు డెలివరీ చేస్తాయి. ఎయిరేషియా ఇండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ లను తనలో విలీనం చేసుకున్న ఎయిండియా త్వరలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ విస్తారాను కూడా కలుపుకోబోతోంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ భారీ కొనుగోలుకు తెరతీశారు టాటాలు.