పచ్చబొట్టు పోతుంది... ఉస్మానియాలో రూ. లక్ష చికిత్స ఫ్రీ - MicTv.in - Telugu News
mictv telugu

పచ్చబొట్టు పోతుంది… ఉస్మానియాలో రూ. లక్ష చికిత్స ఫ్రీ

June 2, 2022

ఫ్యాషన్ అనో, ప్రేమ అనో, ఇష్టం అనో మనలో కొంత మంది యువతీ యువకులు పచ్చబొట్టు పొడిపించుకుంటారు. తీరా కొన్నాళ్లకు ఆ ప్రేమ, ఇష్టం పోయాక వాటిని తీయాలంటే చాలా కష్టమైన పని. ప్రైవేటు హాస్పిటల్‌కి వెళ్లి తీయించాలంటే లక్షలు ఖర్చవుతాయి. అంత ఖర్చు చాలా మంది పెట్టుకోలేరు. అంతేకాక, శరీరంపై పచ్చబొట్లు ఉంటే రక్షణ శాఖలోని కొన్ని ఉద్యోగాలకు అనర్హులవుతారు కూడా. ఇలా పరిస్థితుల్లో ఉన్నవారికి హైదరాబాదులోని ఉస్మానియా హాస్పిటల్ గుడ్ న్యూస్ చెప్పింది. పచ్చబొట్లను ఉచితంగా తీస్తామని వెల్లడించింది. ఇప్పటికే ఎంతోమందికి తీశామని, చికిత్స అవసరమైనవారు తమను సంప్రదించాలని ఆసుపత్రిలోని సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ నాగప్రసాద్ ప్రకటించారు. పచ్చబొట్లను తీసే ప్రక్రియను కూడా ఆయన వివరించారు. డెర్మ్ ఎబ్రేషన్ అనే ప్రక్రియ ద్వారా చర్మాన్ని లోపలివరకు తొలగిస్తారు. తర్వాత ఎటువంటి మచ్చలు కనపడకుండా లేజర్ చికిత్స చేస్తారు. ఈ అవకాశాన్ని అవసరమున్న వారు వాడుకోవాలని ఆయన సూచించారు. అలాగే పచ్చబొట్లు వేయించుకోవద్దని, అందుకు వాడే సూదులు పరిశుభ్రంగా లేకపోతే ఎయిడ్స్ వంటి వ్యాధులు సోకే ప్రమాదముందని హెచ్చరించారు.