ఈ గెలుపు తండ్రిదా? కొడుకుదా? అల్లుడిదా? - బండి సంజయ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఈ గెలుపు తండ్రిదా? కొడుకుదా? అల్లుడిదా? – బండి సంజయ్

November 6, 2022

మునుగోడులో గెలుపుపై ధీమాతో ఉన్న బీజేపీ అనూహ్యంగా ఓటమిని చవిచూసింది. ఓటమి నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఓటమికి కుంగిపోమని మీడియా సమావేశంలో వెల్లడించారు.‘ప్రజా తీర్పును గౌరవిస్తాము. మా అభ్యర్ధి ఈ ఎన్నికల్లో యుద్దం చేశారు. అధికార పార్టీ ఎన్ని బెదిరింపులకు పాల్పడినా మా కార్యకర్తలు బెదరకుండా పని చేశారు. బీజేపీకి భయపడి అన్ని శక్తులు (టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీలు) కలిసి పని చేశాయి. గెలిచిన ఆనందంలో టీఆర్ఎస్ నేతలు అహంకారంగా మాట్లాడుతున్నారు. ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చండి.

అయినా మునుగోడు గెలుపు.. తండ్రి గెలుపా? కొడుకు గెలుపా? అల్లుడి గెలుపా? ఒక్క ఎన్నికకే మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా వచ్చి తిష్ట వేశారు. సాధారణ ఎన్నికల్లో అలా కుదరదు కాబట్టి ఎలా గెలుస్తారో చూద్దాం. అంతా చేస్తే పదివేల మెజార్టీ వచ్చింది. ఈ గెలుపు అసలు గెలుపు కానే కాదు. ఈ గెలుపు ఎన్నికల కమిషనర్ గెలుపు. అధికార పార్టీ డబ్బులు పంచింది కానీ ఎక్కడా దొరకలేదు. దమ్ముంటే ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరిన 12 మందితో రాజీనామా చేయించండి. టీఆర్ఎస్‌ని అడ్డుకునే దమ్మున్న పార్టీ బీజేపీనే. తెలంగాణ అంతటా బీజేపీ ఉంది. మరింత కమిట్‌మెంట్‌తో, అభివృద్ది లక్ష్యంగా పని చేస్తామ’ని వెల్లడించారు.