ఆఫీసును ఖాళీ చేసిన రేవంత్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆఫీసును ఖాళీ చేసిన రేవంత్

October 26, 2017

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని భావిస్తున్న తెలంగాణ టీడీపీ నేత  రేవంత్ రెడ్డి కథకు టీడీపీ ముగింపు పలికినట్లు  తెలుస్తోంది. ఆయన గురువారం అసెంబ్లీ ఆవరణలోని తన గదిని ఖాళీ చేశారు.

దీంతో పార్టీలో ఆయన నిర్వహిస్తున్న కీలక పదవులకు కత్తెరపడినట్లేనని భావిస్తున్నారు.  పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, టీడీఎల్పీ నేతగా రేవంత్ ఎలాంటి  కార్యక్రమాలూ జరపొద్దని  అధినేత చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ గురువారం తెలిపారు. రేవంత్‌ను కేవలం ఎమ్మెల్యేగానే చూడాలని లండన్‌లో ఉన్న చంద్రబాబు తనకు చెప్పారని  రమణ తెలిపారు. కాగా రమణ గోల్కొండ హోటల్లో నిర్వహించనున్న టీడీపీ, బీజేపీ ఎల్పీ సమావేశానికి హాజరు కానన్న రేవంత్ మనసు మార్చుకున్నారు. భేటీకి వెళ్తానని స్పష్టం చేశారు. ఓ ఎమ్మెల్యే హోదాలో మాత్రమే రేవంత్ హాజరు కావచ్చని రమణ చెప్పడం తెలిసిందే.

అన్నీ తీసుకెళ్లారు..

అసెంబ్లీ ఆవరణలోని తెలుగుదేశం పార్టీ చాంబర్‌ను రేవంత్ రెడ్డి గురువారం ఖాళీ చేశారు. ఈ రోజు  ఉదయం హడావుడి గా అసెంబ్లీ కి వచ్చిన రేవంత్  తన గదిలోని  పర్నిచర్ , కంప్యూటర్స్ , ముఖ్యమైన ఫైళ్లను తీసుకెళ్లి, చాంబర్‌కు తాళం వేసుకుని వెళ్లారు.   గురువారం అసెంబ్లీ ఆవరణలో టీడీఎల్పీ భేటీని ఏర్పాటు చేస్తానన్న రేవంత్ తన చాంబర్ ఖాలీ చేయడంతో ఆయన కథ ముగిసినట్లేనని భావిస్తున్నారు.