వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేయాలని సూచించారు. సమాజహితం కోసమైనా వీరు కలవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. టీడీపీ పసుపు రంగు, జనసేన ఎరుపు రంగు కలిపితే వచ్చేది కాషాయమని, ఈ రెండు పార్టీలకు మరో పార్టీ తోడు రావాలని ఆకాంక్షించారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన సొంత పార్టీపై విమర్శలు చేశారు. వీరసింహారెడ్డి డైలాగులను చూసి మా నాయకులు జడుసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబును విమర్శించిన పవన్.. ఇప్పుడెలా కలుస్తారని వైసీపీ నేతలు ప్రశ్నించడాన్ని తప్పుపట్టారు. గతంలో జగన్ ని విమర్శించిన వల్లభనేని వంశీ, జూపూడి ప్రభాకర్ రావులు వైసీపీలో చేరారని, కొందరు మంత్రివర్గంలో ఉన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు, పవన్ పొత్తుపెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. తమ పార్టీ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. కాగా, శ్రీకాకుళంలోని రణస్థలంలో జరిగిన యువశక్తి సభలో పవన్ పొత్తులపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. నియంతను ఎదుర్కోవడానికి అందరం కలిసి పోరాడాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని స్పష్టం చేశారు. ఒంటరిగా వీరమరణం పొందాల్సిన అవసరం లేదని, కొన్ని సార్లు సర్ధుకుపోవాల్సి ఉంటుందన్నారు.