నెల్లూరు జిల్లా కందుకూరు తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ రూ.24 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించింది. మొదట పార్టీ తరుఫున రూ.10 లక్షలు అందిస్తున్నట్టు తెలిపారు. ఆ తర్వాత పార్టీ నాయకులు కూడా వ్యక్తిగతంగా బాధితులకు అర్థికసాయం అందించేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఒక్కో కుటుంబానికి మొత్తం రూ. 24 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నారు. టీడీపీ తరఫున తొలుత ప్రకటించిన రూ.10 లక్షలను రూ.15 లక్షలకు పెంచారు. పార్టీ నేతలు ప్రకటించిన రూ. 9 లక్షలతో కలిపి మొత్తం రూ.24 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు అందజేయనున్నారు. ఏపీ సర్కార్, కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రకటించాయి. చనిపోయినవారికి రూ. 2 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 50 వేల చొప్పున సీఎం ప్రకటించగా..అంతే మొత్తం ప్రధాని మోదీ మంజూరు చేశారు. కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ సభకు కార్యకర్తలు భారీగా తరలిరావడంతో బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మొత్తం 8 మంది మృతిచెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.