TDP asked for 20 crore bribe: YCP MLA Bolla Brahmanaidu
mictv telugu

సిగ్గు లేకుండా నా దగ్గరే రూ. 20 కోట్లు లంచం అడిగారు : వైసీపీ ఎమ్మెల్యే

September 16, 2022

TDP asked for 20 crore bribe: YCP MLA Bolla Brahmanaidu

వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు శుక్రవారం అసెంబ్లీలో కీలక విషయం చెప్పారు. టీడీపీ హయాంలో తనకెదురైన ఓ సంఘటన గురించి వివరిస్తూ అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనను రూ. 20 కోట్లు లంచం డిమాండ్ చేశారని ఆరోపించారు. టెక్స్‌టైల్ పార్కు కోసం ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ హయాంలో 2012లో టెండర్ పిలువగా, తన కంపెనీ తరపున టెండర్ వేసి దక్కించుకున్నానన్నారు.

అనంతరం 108 ఎకరాల రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని, కేంద్రం నుంచి రావాల్సిన రూ. 40 కోట్ల సబ్సీడీ కూడా మంజూరైందన్నారు. అనంతరం రాష్ట్ర విభజనతో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. సబ్సీడీ కింద వచ్చిన 40 కోట్లలో 20 కోట్లు లంచం ఇస్తేనే పార్కు ఏర్పాటు సాధ్యమవుతుందని, లేకుంటే రద్దు చేస్తామని బెదిరించారన్నారు. లంచానికి తాను అంగీకరించకపోవడంతో మరుసటి రోజే ధూళిపాళ్ల నరేంద్ర చేత ప్రభుత్వానికి లేఖ రాయించారని గుర్తు చేశారు. ఆ వెంటనే చంద్రబాబు తన ఇంటికి మనుషులను పంపించి టీడీపీలో చేరితే పార్కును కొనసాగిస్తామని, లేకుంటే రద్దు చేస్తామని బేరం పెట్టారని చెప్పారు. అయినా తాను లొంగకపోవడంతో రిజిస్ట్రేషన్ అయిన భూమిని రద్దు చేశారని మండిపడ్డారు. ఇలాంటి పనుల కారణంగానే టీడీపీ హయాంలో పరిశ్రమలు పారిపోయాయని విమర్శించారు. ఇప్పటి వైసీపీ ప్రభుత్వ ఇస్తున్న ప్రోత్సాహకాలతో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని, జాతీయ స్థాయిలో పోటీపడి బల్క్ డ్రగ్ పార్కును సాధించామని పేర్కొన్నారు.