TDP Chief ChandraBabu, NaraLokesh pay Tributes on Nandamuri Harikrishna's Death Anniversary
mictv telugu

నందమూరి హరికృష్ణ వర్ధంతి.. చంద్రబాబు, లోకేశ్‌ల ఎమోషనల్ ట్వీట్స్

August 29, 2022

దివంగత నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు.. టీడీపీ నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పిస్తున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హరికృష్ణకు నివాళులు అర్పించారు. ఆయన అకాల మరణం ఎప్పటికీ తీరని లోటంటూ గుర్తు చేసుకుంటున్నారు.

మంచితనానికి, ఆప్యాయతకు రూపమిస్తే అది నందమూరి హరికృష్ణ అని చంద్రబాబు కొనియడారు ‘తండ్రి ఎన్టీఆర్ ఆదర్శాలను జవదాటని కొడుకుగా, చైతన్య రథసారథిగా, నటుడిగా.. తెలుగు ప్రజలకు ఎంతో చేరువైన హరికృష్ణగారు.. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పార్టీకి, ప్రజలకు ఎంతోసేవ చేసారు. నందమూరి హరికృష్ణగారి వర్ధంతి సందర్భంగా ఆ సౌజన్యమూర్తి స్మృతికి నివాళులు’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

‘ముక్కుసూటితనం హరి మావయ్య నైజం. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం ఆయనకే ప్రత్యేకమైన వ్యక్తిత్వం. రాజకీయాల్లోనూ, నటనలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హరి మావయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. హరికృష్ణ 2018 ఆగస్టు 29న నల్గొండ సమీపంలోని అన్నేపర్తి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.