తెలంగాణ టీడీపీలో అంతర్గత పోరు ముదిరి పాకాన పడింది. రేవంత్ రెడ్డి రగడ నేపథ్యంలో రెండు వర్గాలు రేపు పోటాపోటీగా సమావేశాలు నిర్వహించనునునాయి. రేవంత్‌రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ నేత కాడని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కుండబద్దలు కొట్టారు. అధినేత చంద్రబాబు లండన్ నుంచి తనతో ఫోన్లో మాట్లాడారని చెప్పారు. ‘నేతలంతా పార్టీ మార్గంలో పనిచేసేలా చూడాలని చంద్రబాబు చెప్పారు. గురువారం మధ్యాహ్నం గోల్కొండ హోటల్లో టీడీఎల్పీ భేటీ జరుగుతుంది. రేవంత్‌రెడ్డిని ఆహ్వానించలేదు’ అని రమణ చెప్పారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్ పదవుల నుంచి రేవంత్ రెడ్డి తప్పంచడం ఖాయమని రమణ తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోది.
మరోపక్క.. అసెంబ్లీలో టీడీఎల్పీ ఫ్లోర్ నాయకుణ్ని తానేనని, ఈ హోదాతోపాటు, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో టీడీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు రేవంత్ కూడా ప్రకటించారు. ‘గురువారం పొద్దున అసెంబ్లీ అవరణలో ఈ భేటీ ఉంటుంది. టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్ నేనే. ఈ సమావేశాన్ని ఎవరూ అడ్డుకోలేరు.. నా వెంట వచ్చే వాళ్లు నాతోనే ఉంటారు’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేలుగా తరఫున రేవంత్‌తో పాటు ఎల్బీనగర్, సత్తుపల్లి ఎమ్మెల్యేలు ఆర్ కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్యలు మాత్రమే ఉన్నారు. పచ్చజెండాపై గెలిచిన మిగతావాళ్లు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కృష్ణయ్య, సండ్రల్లో ఎవరు రేపు రేవంత్ వెంట నిలుస్తారన్నది ఆసక్తి కరంగా మారింది. పోటాపోటీ భేటీ నేపథ్యంలో గురువారం ఈ అంతర్గత కుమ్మలాటకు చంద్రబాబు ఆదేశాల మేరకు ముగింపు కార్డు పడుతుదని భావిస్తున్నారు.