ఏపీలో నాటుసారా, జె బ్రాండ్‌పై మొదలైన టీడీపీ పోరు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో నాటుసారా, జె బ్రాండ్‌పై మొదలైన టీడీపీ పోరు

March 19, 2022

07

ఆంధ్రప్రదేశ్‌లో నాటుసారా, జె బ్రాండ్ మద్యంపై శనివారం టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యాన్ని నిషేధించాలని ఆందోళనలకు దిగారు. ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి 18 మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో టీడీపీ అధినేత మృతులు కుటుంబ సభ్యులను పరామర్శించి, నాటుసారాను, మద్యాన్ని నిషేదించాలని డిమాండ్ చేస్తూ, పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా శనివారం మద్యపాన నిషేధం విధించాలంటూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పోరాటానికి దిగారు. అసెంబ్లీలో టీడీపీ పార్టీ ఎమ్మెల్యేల పోరాటానికి మద్దతుగా గ్రామస్థాయి నుంచి ఆందోళనలు చేపట్టారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నాసిరకం మద్యం తాగి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పేరిట తొమ్మిది రకాలుగా నాసిరకం మద్యం అమ్మకాలకు తెర లేపారని మండిపడ్డారు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ మందుబాబుల ఇళ్లను సీఎం జగన్ దోచేస్తున్నారని అన్నారు.

మరోవైపు విజయనగరం జిల్లా పార్వతీపురంలో సారా మహమ్మారిపై నిరసన తెలియజేస్తున్న టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ర్యాలీగా వెళుతున్న శ్రేణులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకున్నాయి.