Tdp leader ayyanna patrudu arrest case in wall demolition case real reasons
mictv telugu

అయ్యన్నపాత్రుడి అరెస్ట్‌ కారణం ఇల్లేనా? అది కాదా!

November 3, 2022

టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు అయ్యన్నపాత్రుడి ఎపిసోడ్ ఏపీ రాజకీయాలను ఉన్నట్టు వేడెక్కించింది. ఇంటి ప్రహరీ కూల్చివేత కేసులో అయ్యన్న సమర్పించిన పత్రాలు ఫోర్జరీవి అంటూ పోలీసులు ఆయనను, ఆయన కుమారుడు రాజేష్‌ను అరెస్ట్ చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ సీఐడీ కార్యాలయం వద్ద నిరసనలు ఉద్రిక్తమయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యేల వెలగపూడి రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు..

అంత సీనుందా?

కోట్ల విలువైన భూకబ్జాలు, అక్రమాస్తులు, అవినీతి కేసుల్లో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించే పోలీసులు, రెవిన్యూ అధికారులు అయ్యన్న ‘ఇంటి కాంపౌండ్ గోడ’ కేసును ఇంత సీరియస్‌గా టేకప్ చేసి, నోటీసులు, హెచ్చరికలు, అరెస్టులతో భయానక వాతావరణం సృష్టించడం సహజంగానే అతిగా కనిపిస్తోంది. విపక్షనేతలను అధికార పక్షం వేధించడం మామూలే. అయితే అయ్యన్న ‘రెండు సెంట్ల’ భూమి తగాదాలో జగన్ ప్రభుత్వ వైఖరి మరింత సీరియస్‌గా కనిపించడం నేటి రాజకీయాల ట్రెండుకు అద్దం పడుతోంది. టీడీపీలో చంద్రబాబు, లోకేశ్ తర్వాత ప్రాధాన్యం, పలుకుబడి ఉన్న నేత అయ్యన్న. బీసీ కావడం ఆయనకు, పార్టీ ‘బీసీ కార్డు’కు కలిసొచ్చిన అంశం. జగన్ ప్రభుత్వ విధానాలను ఘోరాతిఘోరంగా తూర్పారబట్టడంతో అయ్యన్నకు అయ్యన్నే సాటి. ‘తమలపాకుతో నువ్వొకటంటే తలుపుచెక్కతో నేనొకటంటా,’ అంటారాయన. వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి, కొడాని నాని, రోజా తదితరులు ఆయనను తిట్టి, బండబూతులు తిట్టించుకోవడం మామూలే. ఇవన్నీ ప్రజాస్వామ్య సంవాదంలో సహజమే అని సరిపెట్టుకోవచ్చు. అయితే అయ్యన్న ఎప్పుడూ మరో అడుగు ముందుకేస్తుంటారు.

చోడవరం సభలో.. బూతుబూతు..

‘సీఎం శాడిస్ట్ నాకొడుకు. దౌర్భాగ్యపు నాకొడుకు.. అసలు ఏం పీకావనిరా నీకు వచ్చే ఎన్నికల్లో 173 సీట్లు వస్తాయి? జనం నిన్ను చీపుర్లతో కొడతారు. మోదీ గదిలోకి పదిహేను సార్లు వెళ్లావురా నువ్వు.. లోపల ఏం పిసుకుతున్నావు?నేను మగాణ్ని కానంటోంది రోజా. అమ్మా ఆ విషయం నీకెలా తెలిసింది? వచ్చి టెస్ట్ చేసుకో.’’ ఇవీ ఈ ఏడాది జూన్‌లో చోడవరంలో జరిగిన టీడీపీ మినీ మహానాడులో అయ్యిన్న నోట రాలిన ముత్యాల్లో కొన్ని మాత్రమే. జగన్ ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి ఇవి తప్ప మరే మాటలు దొరకనట్లు ఆయన ప్రసంగం కొనసాగించింది. అందుకు తగ్గ ఫలితం కూడా వెంటనే కనిపించింది. నర్సీపట్నంలోని తన ఇంటి ముందు స్థలాన్ని కబ్జచేసి గోడ కట్టారంటూ అధికారులు అర్ధరాత్రి దాన్ని కూల్చేయించారు. కేసు కోర్టు దాకా వెళ్లింది. కోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. నిబంధనల ప్రకారమే గోడ నిర్మించుకున్నామని చెప్పడంతో కోర్టు వారికి ఊరటనిచ్చింది.

ఫోర్జరీ పత్రాలు..

కేసులో ఇంతటితో అయిపోలేదు. కేసులో అయ్యన్న సమర్పించిన పత్రాలు ఫోర్జరీ అని జగనన్న సర్కారు కొరడా ఝళిపించింది. గోడను అర్ధరాత్రి కూల్చిన పోలీసులు, అయ్యిన్న విదేశాలకు పారిపోతాడన్నట్టు గురువారం తెల్లారుజామున అరెస్ట్ చేశారు. ఈ కేసు రాజకీయ కక్షసాధింపుగా కనిపిస్తోందని ఇదివరకు అన్న కోర్టు తాజాగా అందుకు భిన్నమైన వ్యాఖ్యలేమీ చేయకపోవచ్చు. అయ్యిన్న కబ్జా నిజమైనా అబద్ధమైనా జగన్, రోజా అండ్ కో ఆయన్ను తిట్టే తిట్లలాగే ఉంది ఈ అరెస్ట్, ప్రతీకార వ్యవహారం అన్న విషయంలో మటుకు ఎలాంటి సందేహమూ కనిపించడం లేదు. నోరు అదుపులో పెట్టుకోవాలని పెద్దలు మనకు ఊరికే చెప్పరు. కాకపోతే రాజకీయాల్లో నోరు మూసుకుని ఉంటే మరింత మెత్తుతారు. నోరు లేవాల్సిందే, కేసులు పెట్టి జైళ్లో తోయాల్సిందే. జనం ఉచిత వినోదం చూడాల్సిందే..