తుపాకీ కాల్పుల్లో మండల స్థాయి టీడీపీ నాయకుడు మరణించారు. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటి రెడ్డి గుంటూరులో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. మండలంలో టీడీపీ పటిష్టతకు కృషి చేసిన వ్యక్తిగా బాలకోటి రెడ్డికి పేరుంది. అదే శత్రువులను తెచ్చిపెట్టింది. ఫిబ్రవరి 1న రాత్రి ఇంట్లో ఉండగా వచ్చిన నిందితులు జరిపిన రెండు రౌండ్ల కాల్పుల్లో బాలకోటి తీవ్రంగా గాయపడ్డారు.
దీంతో నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ఆపరేషన్ చేసి బుల్లెట్ బైటికి తీశారు. కోలుకుంటున్నారన్న సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో గుంటూరుకు తరలించగా, వైద్యులు చేతులెత్తేయడంతో బాలకోటి రెడ్డి కన్నుమూశారు. దివంగత మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌కి ముఖ్యమైన అనుచరుడిగా బాలకోటికి పేరుంది. ఈ కాల్పులకు పార్టీల మధ్య గొడవలు, ఆధిపత్య పోరు ముఖ్యమైన కారణాలుగా చెప్తున్నారు. కాగా, గతంలోనూ బాలకోటి రెడ్డిపై దాడులు జరిగాయి. ఇలా రెండు సార్లు దాడుల నుంచి తప్పించుకున్న బాలకోటి మూడోసారి మాత్రం తుపాకీ తూటాలకు బలయ్యారు.