తెలంగాణలో టీడీపీని వీడి వెళ్లిన నాయకులంతా తిరిగి పార్టీలోకి రావాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. అందరం కలిసి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొద్దామని.. అభివృద్ధిలో, సంక్షేమంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదామని అన్నారు. బుధవారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో టీడీపీ విజయ శంఖారావం బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఈనాటి మీటింగ్ రాబోయే రోజుల్లో టీడీపీని తిరుగులేని పార్టీగా తయారు చేస్తుందని, దానికి మీరంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తాను ఫౌండేషన్ వేయకపోతే హైదరాబాద్ ఇంత అభివృద్ధి అయ్యేదా? అని ప్రశ్నించారు. ఆనాడు తాను వేసిన పునాది వల్లే నేడు తెలంగాణలో ఇంత అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు టీడీపీకే ఉందన్నారు. తన తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు తనను అనుసరించినట్లు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికీ లభించని అవకాశం తనకు దక్కిందని, 9 ఏండ్లుగా ముఖ్యమంత్రిగా, 10 ఏండ్ల పాటు ప్రతిపక్షనేతగా ఉన్న రికార్డు తనదని చంద్రబాబు తెలిపారు. ముందుచూపుతో విజన్ 2020 పేరుతో ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు బిల్‌గేట్స్‌ను ఎంతో కష్టపడి కలిసి, మెప్పించి 14 నెలల్లో హైటెక్‌సిటీని నిర్మించానని, ఐటీ రంగంలో ఉద్యోగాలు కల్పించానని అన్నారు. 50 ఇంజనీరింగ్ కళాశాలల సంఖ్యను 250కి పెంచి తెలుగువారిని దేశ విదేశాలకు వెళ్లి ఐటీ ఉద్యోగాల్లో స్థిరపడేలా ఉద్యోగ అవకాశాలు కల్పింమన్నారు. హైదరాబాద్‌లో బయోటెక్నాలజీతో జీనోమ్ వ్యాలీ ఏర్పాటు, క్రీడల అభివృద్ధికోసం గచ్చిబౌలి స్టేడియం, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, బిజినెస్ స్కూల్, జాతీయ రహదారులు ఇవన్నీ తన ప్రభుత్వంలోనే నిర్మించామని గుర్తు చేశారు. రెండుగా విడిపోయిన రాష్ట్రాలను కొందరు మళ్లీ కలవాలంటూ సిగ్గు, శరం లేకుండా చెబుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మళ్లీ ఈ పార్టీ అవసరం ఉంది అనుకున్న వాళ్లు అందరూ ఈ పార్టీలోకి తిరిగి రావాలని.. పూర్వ వైభవానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.