TDP leader GV Reddy apologized to YCP
mictv telugu

చేసిన తప్పుకి వైసీపీకి సారీ చెప్పిన టీడీపీ యువనేత.. తప్పేంటంటే

September 14, 2022

రాజకీయ నేతలంటే ఎప్పుడూ ప్రత్యర్ధి పార్టీలను విమర్శిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు తప్పులు దొర్లుతుంటాయి. అలా దొర్లిన తప్పులను పట్టుకొని అవతలి పార్టీ వారు ఏకిపారేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఏ రాజకీయ నాయకుడైనా క్షమాపణలు చెప్పడం చాలా అరుదు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ నాయకుడైనా తప్పుడు సమాచారం ఇస్తే వెంటనే అవతలి పార్టీ వారు ట్రోలింగ్ మొదలుపెడతారు. ఇలా చాలా మందికి జరిగింది. అయితే తాను చేసిన తప్పును గుర్తించిన ఓ టీడీపీ యువనేత బేషరతుగా వైసీపీకి క్షమాపణలు చెప్పారు. ఈ అరుదైన సంఘటన తెలుగు రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాందిగా భావిస్తున్నారు. ఇంతకీ విషయమేంటంటే.. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని కేంద్ర గణాంకాల్లో మంగళవారం వెల్లడైంది. దీనిని అధికార వైసీపీ వారు గొప్పగా ప్రచారం చేసుకున్నారు.

దీనికి కౌంటర్ ఇచ్చిన టీడీపీ యువ నేత జీవీ రెడ్డి.. ఆ గణాంకాలను పరిశీలిస్తే తొలి స్థానంలో కర్ణాటక, రెండో స్థానంలో గుజరాత్ ఉన్నాయని, ఇందులో ఏపీ సాధించిందేమీ లేదని ట్వీట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే జరిగిన పొరపాటును గుర్తించిన జీవీ రెడ్డి.. గతంలో ఆయా సంస్థలు ప్రకటించిన పెట్టుబడులను కలుపుకొని మాత్రమే ఏపీ తొలి స్థానంలో నిలిచిందని మరో ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా వైసీపీకి సారీ చెప్పారు. తన మొదటి ట్వీట్‌లో తప్పు దొర్లిందని, దానిని రెండో ట్వీట్‌లో సరిచేశానని వివరణ ఇచ్చుకున్నారు. తన తరపున ఎక్స్‌ట్రీమ్లీ సారీ అంటూ ఓపెన్‌గా చెప్పేశారు. దీంతో జీవీ రెడ్డి తన హుందాతనాన్ని ప్రదర్శించారని ఆ పార్టీ వారు అభినందిస్తున్నారు.