TDP leader Nara Lokesh apologized to the people of Undavalli
mictv telugu

మీ పరిస్థితికి కారణం మేమే .. క్షమించండి : నారా లోకేష్

November 17, 2022

ఏపీలో ఎన్నికలకు 16 నెలల సమయం ఉన్నా మూడు పార్టీల ప్రధాన నేతలు ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కర్నూల్‌లో పర్యటిస్తూ.. ఇవే నా చివరి ఎన్నికలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కుమారుడు నారా లోకేష్ ఉండవల్లి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను క్షమించమని కోరారు. దీంతో స్థానికులు కొంత భావోద్వేగానికి లోనయ్యారు. సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతుండగా, తప్పు తెలుసుకొని క్షమాపణ అడిగిన లోకేశ్‌‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు.

ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పుష్కరాల సమయంలో సీతానగరం ఘాట్ వద్ద ఉన్న నివాసాలను తొలగించారు. వారికి ఉండవల్లి వద్ద స్థలాలను ఇచ్చి అన్ని సదుపాయాలతో ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నెరవేర్చకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజా పర్యటన సమయంలో లోకేశ్ బాధితులు ఉంటున్న ప్రాంతానికి వెళ్లి వారు ఉంటున్న ప్రదేశాన్ని చూసి ఆవేదనకు గురయ్యారు. ‘మేం అధికారంలో ఉన్నప్పుడే ఇళ్లు, కరెంటు, నీటి సదుపాయాలు కల్పించి ఉంటే మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇందుకు కారణమైన మమ్మల్ని క్షమించండి. చేతులు జోడించి అడుగుతున్నా. మీరు ధైర్యంగా ఉండండి. వచ్చేది మన ప్రభుత్వమే. రాగానే అన్ని సదుపాయాలు కల్పిస్తా’మని హామీ ఇచ్చారు.