టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన పుంగనూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డిపై లోకష్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ జైలుకెళ్లిన వెంటనే..కుర్చీలో కూర్చోనేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. వైసీపీలో జగన్ తర్వాత తానే అనే ముద్రను వేసుకున్నారని విమర్శించారు. పుంగనూరులో పెద్దిరెడ్డి దోపిడికీ అంతులేకుండా పోయిందని ధ్వజమెత్తారు. మామిడి రైతుల నుంచి పెద్దిరెడ్డి కుటుంబం రూ.100 కోట్లు దోచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదేవిధంగా రూ.500 కోట్ల విలువైన భూములు కబ్జా చేశారని ఆరోపించారు లోకేష్. టీడీపీ అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డి కుటుంబం తిన్నదంతా కక్కిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు మదనపల్లిని కూడా కొత్త జిల్లాగా చేస్తామని తెలిపారు. జిల్లాలో మదనపల్లి, పీలేరు, పుంగనూరులను కలుపుతామని వెల్లడించారు. టీడీపీ ద్వారానే పుంగనూరు అభివృద్ధి జరుతుందని స్పష్టం చేశారు.పెద్దిరెడ్డిని పెద్దాయన అని పిలవాలంట అంటూ ఎద్దేవ చేశారు లోకేష్. జనవరి 27న నారాలోకేష్ యువగళం పాదయాత్రను ప్రారంభించారు. ఇప్పటి వరకు లోకేష్ 437 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈరోజు 34వ రోజు పుంగనూరు నియోజకవర్గం కొక్కువారిపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర చేపట్టారు. నేడు దాదాపు 14.2 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్రగా నడవనున్నారు.