ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న మద్యం నాణ్యతపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రాణాంతకమైన నకిలీ మద్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందన్నారు. ఎప్పుడూ వినని, చూడని బ్రాండ్లను ఎక్కడ తయారు చేస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. ప్రభుత్వ మద్యం షాపుల్లో లభించే లిక్కర్ ను వారం రోజులు తాగితే పక్షవాతం వస్తుందన్నారు. నాసిరకం అమ్మడంతో పాటు రేట్లు పెంచటం మరింత దుర్మార్గ చర్య అని విమర్శించారు.
టీచర్స్ ను సైతం వదలకుండా మద్యం షాపుల వద్ద కాపలా పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిస్టిలరీల్లో ఏ లిక్కర్ తయారు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అమ్మే పాత బ్రాండ్లనే ఏపీలోనూ అమ్మాలని డిమాండ్ చేశారు. నిన్న మద్యం షాపులు తెరుచుకోవటం వల్ల సర్వేపల్లిలోనే ముగ్గురు చనిపోయారని చెప్పారు.