ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు వాడీవేడీగా సాగుతున్నాయి. సభకు వచ్చే గవర్నర్ అహ్వానం పలికే అంశంపై సభ దద్ధరిల్లింది. గవర్నర్‌ను సీఎం జగన్ కోసం వెయిట్ చేయించారంటూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌ను ఈ అసెంబ్లీ సెషన్ మొత్తానికి స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. సభకు పదేపదే అడ్డుతగులడంతో సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో స్పీకర్ కు వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. మరో 10 మంది ఎమ్మెల్యేలను ఒక రోజు సభకు సస్పెండ్ చేశారు. మొత్తం బుధవారం 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు పంపించేశారు.
అయితే అసెంబ్లీ సెషన్ మొత్తానికి పయ్యావుల, నిమ్మలరామానాయుడిని సస్పెండ్ చేయడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేశింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన లేకుండా సస్పెండ్ చేయడాన్ని సభ్యులు ప్రశ్నించారు. దీంతో అప్పటికప్పుడు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మరలా వీరిద్దరిని సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు వినతి చేశారు. అప్పుడు స్పీకర్ మరోసారి ఇద్దరు టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.