నెలరోజుల కిందట గుండెపోటుకు గురైన టీడీపీ ఎమ్మెల్సీ, గన్నవరం ఇంచార్జ్ బచ్చుల అర్జునుడు తుది శ్వాస విడిచారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జనవరి 28న ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు. ఆయన్ను బతికించేందుకు డాక్టర్లు విశ్వప్రయత్నాలు చేశారు. గురువారం ఆయన పరిస్థితి మరింత విషమించడంతో అవయవాలు అన్ని పనిచేయడం ఆపేశాయి. చివరికి అర్జునుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అర్జునుడు మృతితో కుటంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అభిమానులు, కార్యకర్తలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. పలువురు టీడీపీ ముఖ్యనేతలు సంతాపం ప్రకటించారు. ఇటీవల చంద్రబాబు ఆస్పత్రికి వెళ్లి అర్జునుడిని పరామర్శించారు. 2021లోనూ బచ్చుల గుండెపోటుకు గురై చికిత్స పొంది ప్రాణాలతో తిరిగొచ్చారు.
బచ్చుల అర్జునుడు మృతి పార్టీకి తీరని లోటని అచ్చెన్నాయుడు తెలిపారు. ఆయన మరణ వార్త తీవ్ర దిగ్రాంతికి గురి చేసిందన్నారు. నిజాయితీ నిబద్దత కల్గిన నేత బచ్చుల అర్జునుడు అని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్దిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.