‘సాక్షి’పై రూ.75 కోట్ల‌కు నారా లోకేశ్ ప‌రువున‌ష్టం దావా - MicTv.in - Telugu News
mictv telugu

‘సాక్షి’పై రూ.75 కోట్ల‌కు నారా లోకేశ్ ప‌రువున‌ష్టం దావా

January 25, 2020

nara lokesh

ప్రముఖ తెలుగు దినపత్రిక సాక్షిపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ప‌రువున‌ష్టం దావా వేశారు. విశాఖ‌ప‌ట్నం 12వ అద‌న‌పు జిల్లా జ‌డ్జి కోర్టులో రూ.75 కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా దాఖలు చేశారు. త‌న ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లిగించే దురుద్దేశంతో సాక్షి ప‌త్రిక‌లో త‌ప్పుడు వార్త ప్ర‌చురించార‌ని దావాలో పేర్కొన్నారు. సాక్షి పేపర్ 2019 అక్టోబ‌ర్ 22న ‘చిన‌బాబు చిరుతిండి 25 ల‌క్ష‌లండి’ శీర్షిక‌తో ఓ వార్తను ప్రచురించింది. 

ఆ క‌థ‌నంలో ప్ర‌చురితమైన అంశాల‌న్నీ పూర్తిగా అవాస్త‌వాలేన‌ని, దురుద్దేశపూర్వకంగా రాసిన త‌ప్పుడు క‌థ‌నం అని ఖండిస్తూ 2019 అక్టోబ‌ర్ 25న సాక్షి సంపాద‌క‌ బృందానికి నారా లోకేశ్ త‌ర‌ఫున లాయర్లు రిజిస్ట‌ర్ నోటీసు పంపించారు. దీనికి సంబంధించి 2019 న‌వంబ‌ర్ 10న సాక్షి నుంచి తిరుగు స‌మాధానం వ‌చ్చింది. దీనిపై సంతృప్తి చెంద‌ని లోకేశ్ ప‌రువున‌ష్టం దావా వేశారు. విశాఖ‌ప‌ట్నం విమానాశ్రయంలో తాను చిరుతిళ్లు తిన్నాన‌ని సాక్షి రాసిన తేదీల‌లో తాను ఇత‌ర ప్రాంతాల‌లో ఉన్నాన‌ని అయినప్ప‌టికీ త‌న ప‌రువుకు భంగం క‌లిగించేందుకు, రాజకీయంగా ల‌బ్ధి పొందేందుకు అస‌త్యాలతో క‌థ‌నం వేశార‌ని దావాలో పేర్కొన్నారు. మంత్రిగా ప‌నిచేసిన త‌న ప‌రువు ప్ర‌తిష్ట‌లు మంట‌క‌లిపేందుకు త‌నకు సంబంధంలేని అంశాల‌తో ముడిపెట్టి అస‌త్య‌ వార్త రాసి ప్ర‌చురించిన కార‌ణంగా తీవ్ర‌మ‌నోవేద‌న‌కు గుర‌య్యాన‌ని పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన సాక్షి సంస్థ జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ లిమిటెడ్‌, సాక్షి ప్ర‌చుర‌ణ‌క‌ర్త, సంపాద‌కుడైన వ‌ర్థెల్లి ముర‌ళి, విశాఖ‌ప‌ట్నంకి చెందిన సాక్షి న్యూస్ రిపోర్ట‌ర్లు బి వెంక‌ట‌రెడ్డి, గ‌రిక‌పాటి ఉమాకాంత్‌లపై ప‌రువున‌ష్టం దావా దాఖ‌లు చేశారు.