జేసీ మనోడే కదా అని... - MicTv.in - Telugu News
mictv telugu

జేసీ మనోడే కదా అని…

June 17, 2017

విశాఖ ఎయిర్ పోర్టులో వీరంగం సృష్టించిన టీడీపీ ఏంపీ జేసీ దివాకర్ రెడ్డిపై కేంద్రం ఏం చర్యలు తీసుకోబోతోంది..? శివసేన ఎంపీ గైక్వాడ్ విషయంలో కఠినంగా వ్యవహరించి ఆయనపై చర్యలు తీసుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు.. ఇప్పుడు జేసీ విషయంలో ఏం చేయబోతున్నారు..? జేసీ వివాదంలో అంటీముట్టనట్లుగా ఉంటారా…?తమ పార్టీ ఎంపీ కాబట్టి వెనకేసుకొస్తారా..?జేసీతో క్షమాపణ చెప్పిస్తారా…?రాత్రికి రాత్రే జేసీ ఎందుకు విదేశాలకు వెళ్లారు..?
గతంలో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విమానయాన సిబ్బందిపై వ్యవహరించిన తీరును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు
తప్పుపట్టారు. పార్లమెంటు సాక్షిగా ఆయన ఎంపీదే తప్పనట్లు చెప్పారు. తర్వాత కేంద్రంలోని ముఖ్యుల ఒత్తిడితో రవీంద్ర గైక్వాడ్ పౌరవిమానయాన శాఖకు క్షమాపణ లేఖ రాశారు. దీంతో రవీంద్ర గైక్వాడ్ పై విమానయాన నిషేధాన్ని అశోక్ గజపతిరాజు ఎత్తివేయించారు. మరి జేసీ మనోడే కదా అని వదిలేస్తారా..? లేక గైక్వాడ్ లాగే సారీ చెప్పిస్తారా..?

https://www.youtube.com/watch?v=uHdeIITeQcA

గురువారం విశాఖ ఎయిర్‌పోర్టులో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై దాడి చేయడంతో పాటు బోర్డింగ్ పాస్ మేషీన్లను ధ్వంసం చేసిన జేసీపై తీవ్ర విమర్శలు వెల్లుతున్నాయి. ఈ ఘటనపై టీడీపీ హైకమాండ్ రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించి క్షమాపణ చెప్పించేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. క్షమాపణ చెబుతారా అని విలేకరులు హైదరాబాద్‌లో శుక్రవారం ప్రశ్నించగా.. చెప్పడానికి ఏమీ లేదని, తానేమీ మాట్లాడనంటూ వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్లొస్తే వివాదం సద్దుమణుగుతుందని భావించిన జేసీ… కుటుంబంతో సహా యూరప్ వెళ్లారు.

శుక్రవారం రాత్రి 9:50 గంటలకు ఎమిరెట్స్ విమానంలో దుబాయ్ వెళ్లిన జేసీ, అక్కడి నుంచి మరో విమానంలో ఫ్రాన్స్ చేరుకున్నారు. వారం నుంచి పదిరోజులపాటు కుటుంబంతో అక్కడే గడుపుతారట. తాజా వివాదానికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే కుటుంబంతో కలిసి ఆయన విదేశాలకు వెళ్లిపోయారని దేశీయ విమానయాన సంస్థలతో పాటు పలువురు నేతలు అంటున్నారు.

ఇప్పటికే ఇండిగో, ఎయిర్‌ ఇండియా, స్పైస్‌ జెట్‌, విస్తారా, గోఎయిర్, ఎయిర్‌ఆసియా ఇండియా సంస్థలు జేసీని తమ విమానాలు ఎక్కనివ్వబోమని స్పష్టం చేశాయి.టీడీపీ ఎంపీ జేపీ విదేశీ పర్యటనపై ఆయన సన్నిహితులు మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా ఆయన ఇప్పుడు యూరప్ వెళ్లలేదని, కొన్ని రోజుల ముందుగానే ఫ్రాన్స్ వెళ్లాలని నిర్ణయించుకున్నారని అన్నారు. గతంలో శివసేన ఎంపీ గైక్వాడ్ విషయంలో కఠినంగా వ్యవహరించి ఆయనపై చర్యలు తీసుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు, ఎంపీ జేసీ విషయంలో ముట్టిముట్టనట్లుగా ఉంటున్నారు. సీసీటీవీ ఫుటేజీలు అన్ని వివరాలు బయటపెడతాయని, బోర్డింగ్ పాస్ ఇచ్చే సమయానికి జేసీ దివాకర్ రెడ్డి ఎయిర్‌పోర్టుకు రాలేదని గుర్తించామని చెప్పారు. కానీ అంతకుముందు విజయనగరంలో.. జేసీ విషయాన్ని అధికారులే చూసుకుంటారని, ఆయన విషయంలో తనకేం సంబంధం లేదని అశోక్ గజపతిరాజే చెప్పారు. ఇప్పుడు జేసీ విషయంలో ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. వివాదం ముదరక ముందే జేసీతో క్షమాపణలు చెప్పించేలా టీడీపీ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నం ఫలిస్తుందా..జేసీ ఇండిగో ఎయిర్ లైన్ కు సారీ చెబుతారా అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. మొత్తానికి గైక్వాడ్ విషయంలో కఠినంగా వ్యవహరించిన కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు…జేసీ వీరంగంతో అడ్డంగా ఇరుక్కున్నారు. ఈ విషయంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తే…విపక్షాలతోపాటు ఎన్డీయే లోని పక్షాలు కూడా విమర్శించే అవకాశం ఉంది. ఇక చాన్స్ కోసం ఎదురు చూస్తున్న శివసేన గురించి చెప్పనక్కరలేదు. సో గాలిమోటర్ల మంత్రిగా అశోక్ గజపతిరాజు తీసుకునే నిర్ణయమే ఉత్కంఠ రేపుతోంది.