TDP MP Rammohan Naidu complained to Lok Sabha Speaker about MP Gorantla obscene video.
mictv telugu

గోరంట్ల మాధవ్‌‌‌పై స్పీకర్‌కు ఫిర్యాదు, వైకాపాలో అలాంటి వాళ్లెందరో అంటూ..

August 9, 2022

వైసీపీ నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియోపై మంగళవారం లోక్ సభ స్పీకర్‌కు పిర్యాదు చేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. అనంతరం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా వ్యవహరించడంతో అందరు ఎంపీలు ఇలానే ఉంటారా అనే అనుమానం ప్రజలకు వచ్చే అవకాశం ఉందన్నారు. విషయమై స్పీకర్ ఓం బిర్లా కు తాము లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు. గోరంట్ల మాధవ్‌పై చర్య తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తుంటే ఈ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం వైసీపీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎంపీ మాధవ్ వ్యవహరాన్ని ఎలా మేనేజ్ చేయాలనే విషయమై వైసీపీ ప్రయత్నిస్తుందన్నారు.

మాధవ్ పై చర్యలు తీసుకొంటే వైసీపీలోనే చాలామందిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందనే భయంతో ఆ పార్టీ వెనుకాడుతుందని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. వైసీపీలో ఇలాంటి వారిలో గోరంట్ల మాధవ్‌ ఒక్కరే కాదని, ఎంతోమంది ఉన్నారని అన్నారు. గోరంట్ల మాధవ్ వీడియోను టీడీపీ మార్ఫింగ్ చేసిందని చేస్తున్న ప్రచారంపై.. ఈ తరహా వీడియోలు చేయాల్సిన దౌర్భాగ్యం తమ పార్టీకి రాలేదని ఆయన చెప్పారు. గోరంట్ల మాధవ్ వీడియో అసలుదని తేలితే చర్యలు తీసుకొంటామని తొలుత ప్రకటించిన వైసీపీ నేతలు ఆ తర్వాత ఎందుకు మాట మార్చారో చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డిని కోరారు.

సజ్జల చర్యలు తీసుకుంటామని చెప్పారు, మళ్ళీ మాట ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు. గోరంట్ల మాధవ్ విషయం నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు కొత్త కొత్త అంశాలను వైసీపీ తెరమీదికి తీసుకువస్తుందన్నారు. మాధవ్ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపడానికి ఎన్ని రోజులు పడుతుందని ఎంపీ అడిగారు. గోరంట్ల మాధవ్ చేసిన పనికి ఎంపీలుగా తాము కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చిందన్నారు.ఎంపీ మాధవ్ విషయాన్ని వైసీపీ సిగ్గులేకుండా సమర్ధించుకుంటుందని ఆయన విమర్శించారు.