టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. జనవరి 27 నుంచి యాత్ర చేపట్టనున్నారు. అయితే పాదయాత్ర వివరాల్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ముఖ్య నాయకులు ఇవాళ ప్రకటించనున్నారు. అయితే రూట్‌మ్యాప్‌తో పాటూ పేరును కూడా ప్రకటిస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో లోకేష్ పాదయాత్ర పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది తెలుగు తమ్ముళ్లు ఆ పేరును రివీల్ చేశారు. పాదయాత్రకు ‘యువగళం’ అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. మొత్తం 400 రోజుల్లో 4వేల కిలోమీటర్లు ఆయన నడవనున్నారు. పాదయాత్ర మార్గంలో వివిధ వర్గాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను తెదేపా నేతలు నేడు అధికారికంగా ప్రకటించనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించనున్నారు. హంగు, ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ఉండేలా పాదయాత్ర ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు లోకేశ్ సూచించారు. వంద నియోజకవర్గాల మీదుగ సాగనున్న ప్రజాగళం కొనసాగుతుందని.. యువత,మహిళ,రైతు సమస్యలు ప్రతిబింబించేలా పాదయాత్ర ఉంటుంది అంటున్నారు టీడీపీ అభిమానులు.