జనసేనలో గెలిచి జగన్‌కు జై కొడుతున్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయమని రూ.10 కోట్లకు పైగా ఆఫర్ చేశారని తెలిపారు. తన స్నేహితులు ద్వారా టీడీపీ నాయకులు సంప్రదించినట్లు వెల్లడించారు. ఎలక్షన్ కు ముందు నుంచే తనను కొనేందు ప్రయత్నాలు చేశారని రాపాక పేర్కొన్నారు. టీడీపీ లెజిస్లేచర్ మంతెన రాజు తనకు ఆఫర్ ఇచ్చారని రాపాక బయట పెట్టారు.
ఓటు వేయడానికి వెళ్లిన సమయంలో కూడా తనను టీడీపీ వైపు లాగేందుకు ప్రయత్నాలు జరిగాయన వివరించారు. ఓ టీడీపీ ఎమ్మెల్యే తన దగ్గరు వచ్చి మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. టీడీపీకి మద్దతు ఇస్తే పార్టీలో మంచి భవిష్యత్ ఉంటాదని హామీ ఇచ్చారన్నారు. అయితే వారి ఆఫర్‌ను తిరస్కరించానన్నారు. సీఎం జగన్ వెంటే నడుస్తానని చెప్పినట్లు రాపాక వరప్రసాద్ వెల్లడించారు.
సిగ్గు శరీరం వదిలేస్తే తనకు రూ 10 కోట్లు వచ్చేవని..కానీ డబ్బు తీసుకుంటే సమాజంలో బతకలేమని రాపాక వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే శ్రీదేవిపై ముందు నుంచే పార్టీ అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిపారు. మేకపాటి కూడా టీడీపీతో టచ్ లో ఉన్నారని చెప్పారు. ఇద్దరు క్రాస్ ఓటింగ్ చేస్తారనే సమాచారం.. పార్టీకి ఉందని రాపాక చెప్పుకొచ్చారు.
ఏపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించారు. ఆమెకు 23 ఓట్లు లభించాయి. టీడీపీవి 19 ఓట్లు కాగా, వైసీపీకి దూరంగా కోటం రెడ్డి, ఆనం మరో రెండు ఓట్లు వేశారని భావించారు. అయితే మిగతా రెండు ఓట్లు ఎవరేశారన దానిపై వైసీపీ దర్యాప్తు చేసి మేకపాటి, ఉండవల్లి శ్రీదేవిలపై అనుమానం వ్యక్తం చేస్తూ వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
వీరిద్దరితో పాటు కోటం రెడ్డి, ఆనంలను సస్పెండ్ చేస్తున్నట్లు సజ్జల ప్రకటించారు. కేవలం చంద్రబాబు డబ్బులు కోసం టీడీపీ మద్దతు పలికారని విమర్శించారు. ఒక్కో ఎమ్మెల్యేకు 15-20 కోట్లు ఇచ్చి చంద్రబాబు తనవైపు తిప్పుకున్నారని సజ్జల ఆరోపించారు.దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
డబ్బులు ఇచ్చినట్ల ఆధారాలు చూపించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసేందుకు రూ.10 కోట్లు ఆఫర్ చేశారని చెప్పడం కలకలం రేపుతోంది.