2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి వైసీపీ అధికారం చేపట్టాక..ఎలక్షన్ ఏదైనా..ఎక్కడైనా ఫ్యాన్ గాలే వీచింది. కాని మొదటిసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి కలవరపెడుతున్నాయి.108 అసెంబ్లీ స్థానాల పరిధిలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కసారిగా సైకిల్ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలు ప్రకారం రెండింట్లో తెలుగుదేశం అభ్యర్థులు దూసుకుపోతున్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో వైసీపీ-టీడీపీ మధ్య హోరాహోరీ సాగుతోంది.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిరావు ఇప్పటికే 27 వేల ఓట్లకుపైగా మెజార్టీ సాధించి విజయం వైపు దూసుకుపోతున్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులోనూ టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌కు 27,262 ఓట్ల ఆధిక్యం వచ్చింది.పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ-తెలుగుదేశం మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డి 1,382 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ హవా కొనసాగుతుండడంతో పార్టీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఆయన టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. తాజా ఫలితాలపై విశ్లేషించారు. ఫలితాలను చూస్తుంటే వైసీపీ ప్రభుత్వంపై ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థమైందన్నారు. ఇదే స్ఫూర్తితో సాధరణ ఎన్నికల వరకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నీ ప్రలోభాలకు గురిచేసినా ఓటర్లు లొంగలేదని చెప్పారు. నీరో చక్రవర్తి తరహాలో జగన్ ప్రభుత్వం కూడా త్వరలో నాశనం కావడం ఖాయమని జోష్యం చెప్పారు చంద్రబాబు. ఎన్నికల ఫలితాలను చూస్తుంటే విశాఖలో రాజధానిని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.