Tea seller who deposed MLA for tea money in madhya pradesh
mictv telugu

గత ఎన్నికల చాయ్ డబ్బుల కోసం ఎమ్మెల్యేను అడ్డుకున్న టీ సెల్లర్.. వీడియో

November 19, 2022

ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసి గ్రామగ్రామాన తిరిగే అభ్యర్ధులు గెలిచిన తర్వాత ప్రజలకు ముఖం చాటేస్తారు. మళ్లీ ఎన్నికలప్పుడు మళ్లీ నియోజకవర్గంలో ప్రచారానికి వస్తారు. ఇలా గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు తాగిన టీ డబ్బుల కోసం ఇప్పుడు రాబోయే ఎన్నికల ముందు వచ్చిన ఎమ్మెల్యేను టీషాపు ఓనరు పబ్లిక్‌‌గా నిలదీశాడు. వాహనం ఆపి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన వీడియో ప్రస్తుత రాజకీయ నాయకుల తీరుకు అద్దం పడుతుంది. సెహోర్ జిల్లా ఇచావర్ ప్రాంతంలో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కరణ్ సింగ్ వర్మ కారులో వెళ్తున్నారు. ఇంకో పదకొండు నెలల్లో ఎన్నికలు ఉండడంతో ప్రజలతో మమేకం అవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ టీ విక్రేత ఎమ్మెల్యే కారును అడ్డగించి 2018 ఎన్నికలప్పుడు బకాయిపడ్డ టీ డబ్బులు రూ. 30 వేలను వెంటనే చెల్లించాలని పట్టుబట్టాడు. నాలుగేళ్లయినా డబ్బులు ఇవ్వకపోవడమేంటని నిలదీశాడు. స్వల్ప వాగ్వాదం జరగడంతో కొంతమంది ప్రజలు కూడా గుమిగూడారు. వీడియో తీస్తున్నసంగతి గ్రహించిన ఎమ్మెల్యే.. బకాయి పడ్డ మాట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. ఇంటికి వస్తే డబ్బులిస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. కాగా, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇదే జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం.