మీ పిల్లలను అర్జున్ రెడ్డిని చూసి కాదు, జార్జి రెడ్డిని చూసి పెంచండి! - MicTv.in - Telugu News
mictv telugu

మీ పిల్లలను అర్జున్ రెడ్డిని చూసి కాదు, జార్జి రెడ్డిని చూసి పెంచండి!

December 4, 2019

George reddy not arjun reddy.

దిశ హత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు సాగుతున్నాయి. దోషులను ఉరి తీయాలన్న డిమాండ్ మొదలుకుని అంగవిచ్ఛేదం చేయాలన్న డిమాండ్ వరకు ఎన్నో వినతులు వస్తున్నాయి. అయినా మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. యువతలో మార్పు రావాలంటే బాల్యం నుంచే మంచీచెడ్డలు నేర్పాలని, స్త్రీలను గౌరవించడం నేర్పాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. మగపిల్లల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవాలని, వారి ప్రవర్తనను నిత్యం కనిపెడుతూ బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు. 

పోర్న్, మహిళలపై హింసను చూపే సినిమాలు, మద్యం వల్ల యువకులు పెడదారి పడుతున్నారని కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. పురుషాధిపత్యాన్ని, ఆడవారిపై హింసను, విపరీత ప్రవర్తనలను, సెక్స్‌ను గ్లోరిఫై చేసే ‘అర్జున్ రెడ్డి’, ‘దండుపాళ్యం’, ‘ఆర్ఎక్స్ 100’ వంటి సినిమాలు కూడా మహిళలపై నేరాలకు కారణం అవుతున్నాయని చెబుతున్నారు. మరోపక్క.. అర్జున్ రెడ్డి సృష్టించిన మానియా నుంచి యువత కొంచెం తేరుకున్నట్లు కనిపిస్తోంది. దిశ ఉదంతం నడుమ ఇటీవల విడుదలైన ‘జార్జి రెడ్డి’ సినిమా కూడా చర్చలో ప్రస్తావనకు వస్తోంది. యువతులను వేధించిన వారిని చితగ్గొట్టిన జార్జి రెడ్డి జీవిత విశేషాలను అర్జున్ రెడ్డిలోని సన్నివేశాలతో పోలుస్తున్నారు. మహిళలను గౌరవించడమే కాకుండా , కులవివక్ష, అన్యాయాలపై తుదివరకు పోరాడి, ఉస్మానియా చేగువేరాగా పేరొందిన జార్జి రెడ్డి గురించి పిల్లలకు చెప్పాలని కోరుతున్నారు. ‘మీ పిల్లలను అర్జున్ రెడ్డి లాంటి సినిమాలను చూసి కాకుండా జార్జి  రెడ్డి లాంటి సినిమాలు చూసి పెంచండి.. ’ అని కోరుతున్నారు.