Home > Featured > గుర్రమెక్కి స్కూలుకు వస్తున్న టీచర్.. ఎందుకంటే..

గుర్రమెక్కి స్కూలుకు వస్తున్న టీచర్.. ఎందుకంటే..

చందమామ కథల్లో రాజకుమారుడు రాకుమారికై గుర్రమెక్కి వస్తాడు. ఇప్పటికీ అక్కడక్కడా కొన్ని పెళ్లిళ్లలో పెళ్లికొడుకు గుర్రమెక్కి వస్తాడు. ఓచోట మాత్రం ఓ ఉపాధ్యాయుడు గుర్రమెక్కి పాఠశాలకు వస్తున్నాడు. అదేంటని ఆశ్చర్యపోకండి. మరి ఆయన గుర్రమెక్కి పాఠశాలకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందో ఓసారి తెలుసుకుందాం.

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికీ చాలా గ్రామాలకు రవాణా సౌకర్యాలు లేవు. దట్టమైన అడవి మధ్యలో గ్రామాలు వుంటాయి. ఆ గ్రామాలకు వెళ్లాలంటే సమయానికి వాహన సౌకర్యం లేక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఏజెన్సీ ప్రాంతంలోని గెమ్మలి పంచాయతీ పరిధిలో సుర్లపాలెం అనే కుగ్రామం ఉంది. అక్కడున్న ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువులు చెప్పే ఉపాధ్యాయులకు రవాణా పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఆ గ్రామ పాఠశాలకు గంపరాయి వెంకటరమణ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు బదిలీపై వచ్చాడు. క్రమం తప్పకుండా అతను స్కూలుకు వస్తున్నాడు. దీంతో గ్రామస్థులు ఆ యువ టీచర్‌పై మంచి అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నారు.

ఈ క్రమంలో వెంకటరమణ ప్రతిరోజూ ఆ గ్రామానికి రావడానికి పడుతున్న ఇబ్బందిని గమనించిన గ్రామస్థులు అతనికి ఓ గుర్రాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆ గుర్రం ఖరీదు రూ.9000. దీంతో వెంకటరమణ ఆ గుర్రం మీదే నిత్యం పాఠశాలకు రాకపోకలు సాగిస్తున్నాడు. తొలుత గుర్రపు స్వారీ రాక వెంకటరమణ చాలా ఇబ్బందిపడ్డాడు. తర్వాత నేర్చుకున్నాడు. ఇంకే రోజూ గుర్రమెక్కి అడవి గుండా స్వారీ చేసుకుంటూ ఆ వూరికి వచ్చి పిల్లలకు విద్య నేర్పిస్తున్నాడు. వెంకటరమణ పాడేరులో నివాసం ఉంటాడు. ప్రతిరోజు గెమ్మల వరకు బైక్ పై వస్తాడు. అప్పటికే అక్కడ గిరిజనులు గుర్రంతో సిద్ధంగా ఉంటారు.

ఇలా రోజూ గ్రామస్థులు ఆయనకు గుర్రాన్ని తెచ్చి ఇచ్చి, తీస్కెళ్తుంటారు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే.. ఆ గుర్రం పోషణ కూడా గ్రామస్థులే చూసుకుంటున్నారు. తమ గ్రామ బిడ్డల చదువు కోసం ఆ గ్రామస్థులంతా ఇలా టీచర్‌కు చేదోడు వాదోడుగా మారారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సుర్లపాలెం గ్రామానికి రోడ్డు మార్గం వేయాలని ఉపాధ్యాయుడు వెంకటరమణ కోరుతున్నాడు.

Updated : 18 Aug 2019 6:49 AM GMT
Tags:    
Next Story
Share it
Top